Danish Kaneria: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నోట జై శ్రీరామ్.. అమెరికాలో అందరితో కలిసి సంబరాలు
Danish Kaneria: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. జై శ్రీరామ్ అంటూ తన రామ భక్తిని చాటుకున్నాడు.
Danish Kaneria: పాకిస్థాన్ కు ఆడిన అతి కొద్ది మంది ముస్లిమేతర క్రికెటర్లలో ఒకడైన డానిష్ కనేరియా.. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. రామ జన్మభూమిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను సెలబ్రేట్ చేసుకుంటున్న ఏకైక పాకిస్థాన్ క్రికెటర్ అతడే కావడం గమనార్హం. ఓవైపు అయోధ్యలో ఈ ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా అతడు అమెరికాలో ఓ ఆలయాన్ని సందర్శించిన వీడియో షేర్ చేశాడు.
పాకిస్థాన్ లోని మైనార్టీ హిందూ మతానికి చెందిన డానిష్ కనేరియా చాలా ఏళ్ల పాటు అక్కడి నేషనల్ టీమ్ తరఫున ఆడాడు. ప్రపంచంలోని మేటి లెగ్ స్పిన్నర్లలో ఒకడిగా అతడు ఎదిగాడు. అయితే పాక్ టీమ్ లో ముస్లిమేతర క్రికెటర్లపై చూపే వివక్ష కారణంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను కనేరియా ముందుగానే ముగించాడు.
కనేరియా నోట జై శ్రీరామ్
తాజాగా డానిష్ కనేరియా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో ఈ ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా.. అతడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ లో ఓ ఆలయం బయట అక్కడి హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
జై శ్రీరామ్ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేసుకున్నాడు. వీడియో మొదట్లో అయోధ్య రామ మందిరం ఫొటోను ఉంచాడు. నిజానికి గత కొన్ని రోజుల నుంచే కనేరియా అయోధ్య మందిర ప్రారంభోత్సవం గురించి తన ఎక్స్ అకౌంట్లో వరుసగా పోస్టులు చేస్తున్నాడు. రామ మందిరం, అందులో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం ఫొటో కూడా అందులో ఉంది.
అంతేకాదు బాబ్రీ మసీదును కూలగొడుతూ ఓ ముస్లిం వ్యక్తి చేసిన వివాదాస్పద పోస్టుకు కూడా కనేరియా దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. ఓ దొంగ ఎప్పుడూ యజమాని కాడు అనే క్యాప్షన్ తో ఓ వ్యక్తి బాబ్రీ మసీదు కూల్చుతున్న ఫొటో షేర్ చేశాడు. దీనికి కనేరియా స్పందిస్తూ.. అందుకే దొంగ బాబర్ నుంచి అసలైన యజమానులు తమ గుడిని తిరిగి తీసుకుంటున్నారని అనడం గమనార్హం.
సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తిరిగి రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంటుండటంపై కనేరియా సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా జట్టుకు ఆడుతున్న హిందూ క్రికెటర్ కేశవ్ మహరాజ్ కూడా భారతీయులందరికీ శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. అతడో ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేశాడు.
ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కోసం స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లాంటి వాళ్లు అక్కడికి వెళ్లారు. క్రికెటర్లతోపాటు దేశంలోని ప్రముఖలందరికీ ఈ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం దక్కింది. రూ.1800 కోట్ల వ్యయంతో మూడేళ్ల పాటు శ్రమించి భవ్య మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇందులో 51 అంగుళాల పొడవున్న బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.