Danish Kaneria: నన్ను ఇస్లాంలోకి మార్చడానికి అఫ్రిది చాలా ప్రయత్నించాడు: పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Danish Kaneria: నన్ను ఇస్లాంలోకి మార్చడానికి అఫ్రిది చాలా ప్రయత్నించాడు అంటూ పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో కనేరియా ఈ కామెంట్స్ చేశాడు.
Danish Kaneria: పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనను ఇస్లాం మతంలోకి మార్చడానికి చాలానే ప్రయత్నించాడని అతడు చెప్పడం గమనార్హం. ఇండియా టీవీ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ లో తాను పడిన ఇబ్బందుల గురించీ చెప్పాడు.
అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లోకి ఎంపికైన రెండో హిందూ క్రికెటర్ గా డానిష్ కనేరియాకు పేరుంది. డానిష్ కనేరియా కంటే ముందు పాకిస్థాన్ టీమ్ తరఫున ఆడిన మరో హిందూ ప్లేయర్ అనిల్ దళ్‌పత్. తాను జట్టులో ఉన్నప్పుడు ఇంజమాముల్ హక్, షోయబ్ అక్తర్ మాత్రమే మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు.
"నా కెరీర్ చాలా బాగా సాగిపోతోంది. టెస్టుల్లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న వారిలో నేను నాలుగోస్థానంలో ఉన్నాను. నా కెరీర్ సరైన దిశలో వెళ్లింది. కౌంటీ క్రికెట్ కూడా ఆడుతుండేవాడిని. ఇంజమాముల్ హక్ నాకు మద్దతుగా నిలిచాడు. షోయబ్ అక్తర్ కాకుండా నాకు మద్దతుగా నిలిచిన వ్యక్తి ఇంజమామే" అని కనేరియా చెప్పాడు.
ఇక అఫ్రిది తనను ఎలా ఇబ్బందులకు గురి చేశాడో కూడా ఈ సందర్భంగా అతడు వివరించాడు. "షాహిద్ అఫ్రిది, ఇతర ప్లేయర్స్ చాలా ఇబ్బంది పెట్టారు. నాతో కలిసి వాళ్లు భోజనం చేసేవాళ్లు కాదు. నాతో మతం మారే విషయమే మాట్లాడేవాళ్లు. కానీ నాకు మాత్రం నా మతమే సర్వస్వం. నన్ను ఇస్లాంలోకి మార్చడానికి షాహిద్ అఫ్రిది చాలా ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇంజమాముల్ హక్ మద్దతుగా నిలిచాడు" అని కనేరియా చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ టీమ్ తరఫున 2000 నుంచి 2010 మధ్య కనేరియా 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 261 వికెట్లు, వన్డేల్లో 15 వికెట్లు తీసుకున్నాడు. కనేరియాపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై ఒత్తిడి కారణంగానే ఆ ఆరోపణలను అంగీకరించాల్సి వచ్చిందని అతడు చెప్పడం గమనార్హం.
"కౌంటీ క్రికెట్ లో ఆడే సమయంలో నాపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. నేను బుకీని కలిశానని చెప్పాను. కానీ నాపై అభియోగాలను అంగీకరించాల్సిందిగా వాళ్లు నాపై ఒత్తిడి తెచ్చారు. నేను హిందువును కాబట్టి పీసీబీ నాకు మద్దతుగా నిలవలేదు. నేను అలాగే ఆడితే వాళ్ల రికార్డులు బ్రేక్ చేస్తానని భయపడ్డారు. టాలెంట్ విషయంలో నన్ను ఆపలేరన్న విషయం వాళ్లకు తెలుసు" అని కనేరియా అన్నాడు. కనేరియా చేసిన ఆరోపణలపై షాహిద్ అఫ్రిది స్పందించలేదు.