Shoaib Akhtar on Team India: సెమీఫైనల్లో టీమిండియాను గెలిపించేది అతడే: షోయబ్ అక్తర్
15 November 2023, 10:50 IST
- Shoaib Akhtar on Team India: సెమీఫైనల్లో టీమిండియాను గెలిపించేది బుమ్రానే అంటూ షోయబ్ అక్తర్ కీలకమైన కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అతడే అని స్పష్టం చేశాడు.
టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ బుమ్రానే అంటున్న అక్తర్
Shoaib Akhtar on Team India: వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తో టీమిండియా సెమీఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. అతడే మ్యాచ్ విజయంలో కీలకం కానున్నాడని అక్తర్ స్పష్టం చేశాడు. ఇండియా బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా.. మ్యాచ్ గెలవాలంటే మాత్రం బుమ్రానే కీలకం కాబోతున్నాడని అక్తర్ అనడం విశేషం.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్ జరగబోతోంది. దీంతో ఈ మ్యాచ్ పై షోయబ్ అక్తర్ స్పందించాడు. "బ్యాటింగ్ పక్కన పెడితే ఓ బౌలర్ గా నేను జస్‌ప్రీత్ బుమ్రానే కీలకం అంటాను. తన స్కిల్స్ కి తగినట్లు అతడు రాణించి ఉండకపోతే.. షమి, సిరాజ్ కూడా ఇబ్బంది పడేవారు.
ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా.. వరల్డ్ కప్ గెలవాలంటే మాత్రం బౌలింగే కీలకం అని ప్రపంచానికి ఈ వరల్డ్ కప్ ద్వారా బుమ్రా నిరూపించాడు. వరల్డ్ కప్ లో బౌలర్లు తీసుకునే 10 వికెట్లే చాలా ముఖ్యం. టీమిండియాకు బుమ్రానే ఎక్స్ ఫ్యాక్టర్. పవర్ ప్లేలో అతడు 2, 3 సగటుతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇది నమ్మశక్యం కానిదే" అని అక్తర్ అన్నాడు.
ఇక బుమ్రా ఫిట్‌నెస్ కూడా తనను ఆశ్చర్యపరిచినట్లు అక్తర్ తెలిపాడు. "బుమ్రా ఫిట్‌నెస్ పై నాకు కొన్ని సందేహాలు ఉండేవి. అతడు 10 ఓవర్లు వేయగలడా? మొత్తం 9 మ్యాచ్ లు ఆడగలడా అని అనుకున్నాను. కానీ అతడు ఫిట్ గా ఉండి మమ్మల్ని తప్పని నిరూపించాడు. ఇండియా బౌలింగ్ లైనప్ ను సక్సెస్ వైపు తీసుకెళ్లాడు" అని అక్తర్ కొనియాడాడు.
ఎంత ఫామ్ లో ఉన్నా కూడా సెమీఫైనల్లో బోల్తా పడకూడదని టీమిండియాను అక్తర్ హెచ్చరించాడు. "క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఇండియా అద్భుతమైన క్రికెట్ ఆడింది. వాళ్లు ట్రోఫీ గెలవడానికి అర్హులు. కానీ ఇప్పుడు మాత్రం బోల్తా పడకూడదు. ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్లో అది జరగకూడదని అనుకుంటున్నాను" అని అక్తర్ అన్నాడు.
2019 వరల్డ్ కప్ లోనూ లీగ్ స్టేజ్ లో ఇలాగే వరుస విజయాలు సాధించి సెమీఫైనల్ చేరిన టీమిండియా.. అక్కడ న్యూజిలాండ్ చేతుల్లోనే బోల్తా పడింది. అందుకే ఈసారి అది రిపీట్ కాకూడదని అక్తర్ హెచ్చరిస్తున్నాడు.