India vs New Zealand Semi Final: వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్లో ఏం జరిగింది? న్యూజిలాండ్ చేతుల్లో ఇండియా ఎలా ఓడిపోయిందంటే?
India vs New Zealand Semi Final: వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి టీమిండియా అభిమానులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి అదే టీమ్ తో సెమీఫైనల్ కు సిద్ధమవుతున్న వేళ అసలు అప్పుడేం జరిగిందో ఒకసారి చూద్దాం.
India vs New Zealand Semi Final: టీమిండియా వరల్డ్ కప్ 2023లో టాప్ ఫామ్ లో ఉంది. లీగ్ స్టేజ్ లో అసలు ఓడిపోలేదు. ఇప్పుడు ఎలాంటి టీమ్ అడ్డొచ్చిన తొక్కేసుకుంటూ వెళ్లడమే అనే మూడ్ లో ప్లేయర్స్ ఉన్నారు. అయితే బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్ తో సెమీఫైనల్ కు ముందు వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్లో ఇదే జట్టు చేతుల్లో ఇండియన్ టీమ్ ఓటమి అభిమానులను వెంటాడుతోంది.
ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అది. ఇండియాను ఫైనల్ చేర్చడానికి జడేజాతో కలిసి అతడు పోరాడిన తీరు, చివరికి రనౌట్.. ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ ను ఓ మూడు వన్డేల సిరీస్ లో ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లోనూ చిత్తుగా ఓడించింది. కానీ సెమీఫైనల్ ఒత్తిడి మరో లెవల్లో ఉంటుంది.
2019 సెమీఫైనల్లో ఏం జరిగిందంటే?
వరల్డ్ కప్ 2019లోనూ ఇండియా లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లలో 7 గెలిచి టాప్ ప్లేస్ లో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అటు న్యూజిలాండ్ 9 మ్యాచ్ లలో 5 గెలిచి, 3 ఓడి, ఒక దాంట్లో ఫలితం తేలకపోవడంతో నాలుగో స్థానంతో సెమీస్ కు అర్హత సాధించింది. ఈ రెండు టీమ్స్ తొలి సెమీఫైనల్లో తలపడ్డాయి.
ఈ మ్యాచ్ ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో ఉన్న ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విఫలమైనా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) రాణించడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 రన్స్ చేసింది. సులువైన టార్గెటే కదా.. టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఈజీగా చేజ్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు.
కానీ చేజింగ్ లో పరిస్థితులు తారుమారయ్యాయి. 5 పరుగులకే 3 వికెట్లు డౌన్. కివీస్ బౌలర్లు హెన్రీ, బౌల్ట్ ధాటికి బెంబేలెత్తిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లి (1) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ (6), కాసేపు వికెట్ల పతనాన్ని ఆపిన రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (32) కూడా ఔటయ్యారు. దీంతో 92 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి.
ఇక మ్యాచ్ పై ఆశలు వదులుకున్న వేళ ధోనీ, జడేజా జత కలిశారు. ఇద్దరూ కష్టమ్మీద ఒక్కో పరుగూ జోడిస్తూ ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టారు. అభిమానులకు మళ్లీ మ్యాచ్ పై ఆశలు రేగుతున్న వేళ కెప్టెన్ ధోనీ (50) రనౌట్ గుండెకోతను మిగిల్చింది. దీంతో 116 పరుగుల 7వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జడేజా (77) ఒంటరి పోరాటం చేసినా.. 48వ ఓవర్లో అతడు కూడా ఔటవడంతో ఇండియా ఓటమి ఖాయమైంది. చివరికి 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఇండియా ఆలౌటైంది. 18 పరుగులతో ఓడి ఇంటిదారి పట్టింది. ధోనీని బ్లూ జెర్సీలో చూసిన చివరి మ్యాచ్ అదే.