Shivam Dube: బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబె, సూర్యకుమార్.. సిక్సర్ల మోత మోగించిన ముంబై బ్యాటర్లు
03 December 2024, 14:17 IST
- Shivam Dube: టీమిండియా బ్యాటర్లు శివమ్ దూబె, సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ముంబై తరఫున సర్వీసెస్ పై సిక్సర్ల మోత మోగించారు. ముఖ్యంగా దూబె చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబె, సూర్యకుమార్.. సిక్సర్ల మోత మోగించిన ముంబై బ్యాటర్లు
Shivam Dube: శివమ్ దూబె మరోసారి మెరుపులు మెరిపించాడు. గత నాలుగైదు నెలలుగా టీ20 క్రికెట్ కు దూరంగా ఉన్న అతడు.. సయ్యాద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ముంబై తరఫున బరిలోకి దిగాడు. హైదరాబాద్ లో సర్వీసెస్ తో మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికితోడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోవడంతో ముంబై భారీ స్కోరు చేసింది.
శివమ్ దూబె మెరుపులు
ఈ ఏడాది జులై నుంచి శివమ్ దూబె టీ20 క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మొత్తానికి ఇన్ని నెలల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బరిలోకి దిగాడు. సర్వీసెస్ తో మ్యాచ్ లో ముంబై 3 వికెట్లకు 60 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బరిలోకి దిగిన దూబె.. తనదైన స్టైల్లో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు సిక్స్ లు ఉండటం విశేషం. రెండు ఫోర్లు కూడా కొట్టాడు. 197 స్ట్రైక్ రేట్ తో దూబె పరుగులు సాధించాడు.
సూర్యకుమార్ తో కలిసి నాలుగో వికెట్ కు కేవలం 11 ఓవర్లలోనే 130 పరుగులు జోడించాడు. అటు సూర్యకుమార్ కూడా 46 బంతుల్లో 70 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. దీంతో ముంబై టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 రన్స్ చేసింది. ఈ ఇద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ముంబై ఆడబోయే చివరి రెండు మ్యాచ్ లలోనూ బరిలోకి దిగాలని దూబె, సూర్య నిర్ణయించుకున్నారు.
శివమ్ దూబె కమ్‌బ్యాక్
టీమిండియాలో ఆల్ రౌండర్ గా నిలదొక్కుకుంటున్న వేళ దులీప్ ట్రోఫీలో ఆడుతూ శివమ్ దూబె గాయపడ్డాడు. దీంతో అతన్ని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ లకు ఎంపిక చేయలేదు. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగిన అతడు.. వచ్చీ రాగానే సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ తో అతడు మరోసారి టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడినట్లే. అందులోనూ కెప్టెన్ సూర్యకుమార్ ముందే ఇలా చెలరేగడంతో అతడు మరోసారి టీమిండియా తలుపు తట్టడం ఖాయం.
ఇక ఐపీఎల్లో దూబె విషయానికి వస్తే అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.12 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఆ టీమ్ తరపున దూబె అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి సీజన్ లోనే 289 రన్స్ చేశాడు. ఆ తర్వాత 2023లో 158.33 స్ట్రైక్ రేట్ తో 418 రన్స్, 2024లో 162.3 స్ట్రైక్ రేట్ తో 396 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్ కు కూడా ఎంపికయ్యాడు. గాయం కారణంగా నాలుగు నెలలు దూరంగా ఉన్న దూబె.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటడం విశేషం.