Team India: వందకుపైగా వన్డేలు ఆడి ఒక్క మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేయని టీమిండియా క్రికెటర్లు ఇద్దరే!
05 August 2024, 11:20 IST
Team India: టీమిండియా తరఫున వందకుపైగా వన్డేలు ఆడినా... ఒక్క మ్యాచ్‌లో కూడా ఇద్దరు క్రికెటర్లు బౌలింగ్ చేయలేదు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
శిఖర్ ధావన్.
Team India: టీమిండియా దిగ్గజ క్రికెటర్లుగా పేరుతెచ్చుకున్న సచిన్, కోహ్లి, గంగూళీతో పాటు పలువురు క్రికెటర్లు బౌలింగ్‌లోనూ తమ ప్రావీణ్యాన్ని చాటారు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లను అందించిన ధోనీ కూడా వన్డేల్లో బౌలర్ గా ఓ వికెట్ సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో సచిన్ 154 పైగా వికెట్లు తీశాడు. బౌలర్‌గా పలు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా వన్డేల్లో బౌలింగ్ చేసి వికెట్లు తీశారు.
అయితే ఓ ఇద్దరు క్రికెటర్లు మాత్రం టీమిండియాలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలింగ్ చేయలేకపోయారు. ఆ క్రికెటర్లు ఎవరంటే...
శిఖర్ ధావన్...
శిఖర్ ధావన్ టీమిండియాలో కేవలం బ్యాటర్‌గానే కొనసాగాడు. 2010లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్ పన్నెండేళ్ల కెరీర్‌లో 167 వన్డేలు ఆడాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతడు బౌలింగ్ చేయలేదు. టెస్టుల్లో ఐదు మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు ధావన్. ఐపీఎల్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అయితే టీమిండియా తరఫున వన్డేలతో పాటు టీ20లో బౌలింగ్ టాలెంట్‌ను ఒక్కసారి కూడా చూపించలేదు.
గాయం కారణంగా...
పేలవ ఫామ్‌తో పాటు యంగ్ క్రికెటర్లతో పోటీ కారణంగా గత రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు ధావన్. జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తుంటాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ధావన్...గాయం కారణంగా 2023 సీజన్ లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. 2025 ఐపీఎల్ తర్వాత ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహ్మద్ కైఫ్...
టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు మహ్మద్ కైఫ్. 2002లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ కైఫ్ 2006 వరకు మాత్రమే జట్టులో కొనసాగాడు. నాలుగేళ్లలో 125 వన్డేలు ఆడిన కైఫ్ ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలింగ్ చేయలేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించిన కైఫ్ టీమిండియా తరఫున తన బౌలింగ్ ప్రావీణ్యాన్ని చూపించలేదు. 125 వన్డేల్లో 2753 పరుగులు చేశాడు కైఫ్. ఇందులో రెండు సెంచరీలు, పదిహేడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పదమూడు టెస్ట్‌లు ఆడిన కైఫ్ 624 రన్స్ చేశాడు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.