Sarfaraz Khan stats: పిచ్చెక్కించే నంబర్లు ఇవి.. సర్ఫరాజ్ ఖాన్ స్టాట్స్ చూసి షాక్ తిన్న రవిశాస్త్రి, గ్రేమ్ స్వాన్
15 February 2024, 14:04 IST
- Sarfaraz Khan stats: సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ రికార్డులు చూసి షాక్ తిన్నారు కామెంటేటర్లు రవిశాస్త్రి, గ్రేమ్ స్వాన్. టీమిండియా పిలుపు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అతనికి మొత్తానికి ఇంగ్లండ్ తో మూడో టెస్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే.
రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ స్టాట్స్ చూసి షాక్ తిన్న రవిశాస్త్రి, గ్రేమ్ స్వాన్
Sarfaraz Khan stats: సర్ఫరాజ్ ఖాన్.. ఇండియన్ క్రికెట్ లో చాలా రోజులుగా వినిపిస్తున్న పేరు ఇది. డొమెస్టిక్ క్రికెట్ లో టన్నుల కొద్దీ రన్స్ చేస్తున్నా నేషనల్ టీమ్ పిలుపు అందడం లేదని ఎన్నో వార్తలు మనం చూశాం. మొత్తానికి అతని నిరీక్షణ ఫలించింది. ఇంగ్లండ్ తో రాజ్‌కోట్ లో గురువారం (ఫిబ్రవరి 15) ప్రారంభమైన మూడో టెస్టులో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా అతని రంజీ ట్రోఫీ స్టాట్స్ చూసి రవిశాస్త్రి, గ్రేమ్ స్వాన్ షాక్ తిన్నారు.
సర్ఫరాజ్ ఖాన్.. టన్నుల్లో రన్స్
టీమిండియాకు ఆడాలన్న సర్ఫరాజ్ ఖాన్ కల మొత్తానికి ఫలించింది. మూడో టెస్టుకు ముందు లెజెండరీ ప్లేయర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా తన టెస్ట్ క్యాప్ అందుకున్నాడతడు. గత మూడు రంజీ సీజన్లలో పరుగుల వరద పారించినా దక్కని అవకాశం.. మొత్తానికి కొందరు సీనియర్ ప్లేయర్స్ దూరం కావడంతో లభించింది. మూడో టెస్ట్ తొలి రోజు స్క్రీన్ పై సర్ఫరాజ్ రంజీ గణాంకాలు చూపించగానే చాలా మంది నోరెళ్ల బెట్టారు.
ఆ సమయంలో కామెంటరీ ఇస్తున్న ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అయితే షాక్ తిన్నాడు. "ఈ పిల్లాడు చాలా పరుగులు చేస్తున్నాడు. అందులో ఎలాంటి పొరపాటూ లేదు. ఒకసారి ఆ సగటు చూడండి.. 154 అంటే మాటలు కాదు. ఆ నంబర్లు చూస్తే పిచ్చెక్కుతోంది" అని స్వాన్ అన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న రవిశాస్త్రి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"చాలా రోజులుగా అతడు టీమిండియా తలుపు తడుతూనే ఉన్నాడు. సెలక్టర్లు ఈ స్కోర్లు చూడాలని అతడు భావించాడు. తన ఎంట్రీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూడగా.. మొత్తానికి ఇవాళ దక్కింది" అని రవిశాస్త్రి అన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ రంజీట్రోఫీ ప్రదర్శన
సర్ఫరాజ్ ఖాన్ 2019-20 నుంచి 2022-23 వరకూ మూడు రంజీ సీజన్లలో చెలరేగిపోయాడు. ఈ మూడు సీజన్లు కలిపి 27 ఇన్నింగ్స్ లో ఏకంగా 2466 రన్స్ చేయడం గమనార్హం. 2019-20 సీజన్లో 9 ఇన్నింగ్స్ లో 928 రన్స్ చేశాడు. ఆ ఏడాది అతని సగటు ఏకంగా 154.66 కావడం విశేషం. ఇక తర్వాత ఏడాది అతడు 9 ఇన్నింగ్స్ లో 982 రన్స్ చేశాడు. ఈసారి అతని సగటు 122.75గా ఉంది. ఇక గత సీజన్లో 9 ఇన్నింగ్స్ లో 556 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్ తో మూడో టెస్టులో అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని అందరూ భావించారు. కానీ ఇండియన్ టీమ్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజాను సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు పంపించారు. నిజానికి ఈ ఎత్తుగడ ఫలించింది. అతడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు.
కానీ రవిశాస్త్రి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. "నేనైతే సర్ఫరాజ్ నే పంపించేవాడిని. ఇందులో సందేహం లేదు. అతడు తొలి టెస్ట్ ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్ తొలి రోజు. మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. స్పిన్ బాగా ఆడతాడు. జడేజాను పంపడానికి అతడు లెఫ్ట్ హ్యాండ్ అన్నదే కారణం కావచ్చు. కానీ తొలి టెస్టు ఆడుతున్న వ్యక్తికి సవాలు విసరాలంటే అతనిపై నమ్మకం ఉంచాలి. టెస్ట్ క్రికెట్ అంటేనే అది. ఒకవేళ అతడు ఈ టెస్టులో పాసైతే మెరుగైన ప్లేయర్ అవుతాడు" అని రవిశాస్త్రి అన్నాడు.
టాపిక్