Sarfaraz Khan: ఎట్టకేలకు టీమిండియాలోకి సర్ఫరాజ్‌ఖాన్ - కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి
Sarfaraz Khan: టీమిండియాకు ఆడాలనే సర్ఫరాజ్ ఖాన్ కల తీరడంతో అతడి తండ్రి ఎమోషనల్ అయ్యాడు. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
టీమిండియాలోకి అడుగుపెట్టాలనే చిరకాల కలను సర్ఫరాజ్‌ఖాన్ నెరవేర్చుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటు కల్పించింది. మైదానంలోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే క్యాప్ అందించాడు. కుంబ్లే నుంచి క్యాప్ అందుకుంటోన్న తరుణంలో సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్‌గా కనిపించాడు. కన్నీళ్లను అదిమిపెట్టుకుంటూ కనిపించాడు.
సర్ఫరాజ్ తండ్రి ఎమోషనల్...
కుంబ్లే నుంచి సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోవడం చూసి అతడి నౌషద్ ఖాన్, భార్య రోమన ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు చేతిలో ఉన్న టీమిండియా క్యాప్‌ను ముద్దుపెట్టుకున్నాడు నౌషద్. కన్నీళ్లతోనే కొడుకును కౌగిలించుకున్నాడు. టీమిండియా క్యాప్ చూసి సర్ఫరాజ్ భార్య రోమన కూడా కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయింది. ఆమె కన్నీళ్లను తుడుస్తూ సర్ఫరాజ్ ఖాన్ కనిపించాడు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. టీమిండియాకు ఆడాలనే సర్ఫరాజ్ కల ఎట్టకేలకు నెరవేరడంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ గాయపడటంతో...
తొలుత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్‌ఖాన్‌ను సెలెక్టర్లు ఎంపికచేయలేదు. కానీ కేఎల్ రాహుల్ గాయపడటం, శ్రేయస్ అయ్యర్, భరత్ కోనం విఫలం కావడంతో అనూహ్యంగా సర్ఫరాజ్‌ను జట్టులో చోటు దక్కింది. అనుకోకుండా టీమిండియాకు ఆడాలనే అతడి కల తీరింది.
పదకొండు సెంచరీలు...
గత కొంతకాలంగా దేశవాళీలో సర్ఫరాజ్‌ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడు. 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 65.85 యావరేజ్‌తో 3912 రన్స్ చేశాడు. ఇందులో 14 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్ ఏ టీమ్‌తో జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు.
సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్ కూడా ఇటీవల జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్స్‌లో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీలో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు.
కాగా మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కూడా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. భరత్ కోనం స్థానంలో ఈ ఐపీఎల్ స్టార్ జట్టులోకి వచ్చాడు. ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లి దూరమయ్యాడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇండియా, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా వైజాగ్ టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది.