Rohit Sharma DRS: రిషబ్ పంత్ వద్దన్నా.. కెప్టెన్ రోహిత్ శర్మని డీఆర్‌ఎస్‌కి ఒప్పించిన సర్ఫరాజ్ ఖాన్, రీప్లేలో సర్‌ప్రైజ్
24 October 2024, 12:56 IST
IND vs NZ 2nd Test: భారత్ జట్టులోని 10 మంది ఆటగాళ్లు విల్ యంగ్ క్యాచ్‌పై డౌట్‌గా ఉన్నా.. సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే డీఆర్‌ఎస్ కోసం పట్టుబట్టాడు. అతని బలవంతంతో రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరగా.. రీప్లే చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు.
విల్ యంగ్ వికెట్ పడిన ఆనందంలో టీమిండియా
న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చొరవతో అశ్విన్‌కి వికెట్ దక్కింది. గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ టీమ్ 35 ఓవర్లు ముగిసే సమయానికి 113/2తో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (13 బ్యాటింగ్: 25 బంతుల్లో 1x4), దేవాన్ కాన్వె (60 బ్యాటింగ్: 120 బంతుల్లో 8x4) ఉన్నారు.
అశ్విన్‌కే ఫస్ట్ 2 వికెట్లు
తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (15: 22 బంతుల్లో 2x4) వికెట్ పడగొట్టిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమ్ స్కోరు 76 వద్ద విల్ యంగ్ (18: 45 బంతుల్లో 2x4) కూడా బోల్తా కొట్టించాడు. అయితే.. టామ్ లాథమ్ ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయినా.. విల్ యంగ్ వికెట్ అంత సులువుగా అశ్విన్‌కి దొరకలేదు. సర్ఫరాజ్ ఖాన్ చొరవ తీసుకుని డీఆర్‌ఎస్ తీసుకునేలా కెప్టెన్ రోహిత్ శర్మని ఒప్పించడంతో ఆ వికెట్ సాధ్యమైంది.
అప్పీల్ తిరస్కరణ
ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన అశ్విన్.. ఆఖరి బంతిని ఓవర్ ద వికెట్ వచ్చి లెంగ్త్ బాల్‌గా విసిరాడు. దాంతో.. ఆ బంతిని విల్ యంగ్ ప్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే టర్న్ అయిన బంతి లెగ్ సైడ్ అతని బ్యాట్‌కి దొరకకుండా నేరుగా కీపర్ రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. బంతి బ్యాట్‌కి అత్యంత సమీపంలో వెళ్లడంతో క్యాచ్ ఔట్ కోసం భారత్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు.
వెనక్కి తగ్గని సర్ఫరాజ్
కానీ.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ బంతి గ్లోవ్‌కి తాకిందంటూ ధీమాతో చెప్తూ కనిపించాడు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం బంతి తాకలేదని చెప్పడంతో రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకునేందుకు తొలుత నిరాకరించాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి తగ్గలేదు.
సర్ఫరాజ్ తన వాదనని బలంగా వినిపించడంతో విరాట్ కోహ్లీ, అశ్విన్ కూడా అతనికి మద్దతుగా నిలిచారు. దాంతో అయిష్టంగానే రోహిత్ శర్మడీఆర్‌ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో బంతి గ్లోవ్స్‌కి తాకినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నాటౌట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ ఆశ్చర్యపోతూ సర్ఫరాజ్‌ని అభినందించాడు.
సర్ఫరాజ్ కోసం రోహిత్ సాహసం
సర్ఫరాజ్ ఖాన్ కోసం ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ పక్కనపెట్టాడు. తొలి టెస్టులో 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది భారత్ తరఫున కేవలం 5 టెస్టు మాత్రమే. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో 24 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌కి అపార అనుభవం ఉంది.