Duleep Trophy 2024: సంజూ శాంసన్, రింకూ సింగ్‌తోపాటు దులీప్ ట్రోఫీకి దూరమైన స్టార్ క్రికెటర్లు వీళ్లే!
17 August 2024, 9:43 IST
దులీప్ ట్రోఫీ 2024 కోసం నాలుగు టీమ్‌లను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈ సారి దులీప్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌తో పాటు పలువురు టీమిండియా స్టార్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. దులీప్ ట్రోపీకి సంజూ శాంసన్, రింకూసింగ్‌తోపాటు మరికొందరు క్రికెటర్లు దూరమయ్యారు.
దులీప్ ట్రోఫీ 2024
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024కు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు నాలుగు టీమ్‌లను బీసీసీఐ ఇటీవల ప్రకటించంది. టీమ్ ఇండియాలో చోటు దక్కాలంటే దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలంటూ బీసీసీఐ రూల్ పెట్టడంతో ఈ సారి దులీప్ ట్రోఫీలో ఇండియన్ స్టార్ క్రికెటర్లు అందరూ బరిలోకి దిగుతోన్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి అగ్ర క్రికెటర్లు సైతం దులీప్ ట్రోఫీ ఆడనున్నారు.
తప్పుకున్నారా...తప్పించారా...
అయితే దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ అనౌన్స్ చేసిన జట్టులో కొంతమంది టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. గాయాలతో పాటు ఇతరత్రా సమస్యలు ఏం లేకపోయినా దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ వారిని ఎందుకు ఎంపికచేయలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రికెటర్లు తప్పుకున్నారా? లేదంటా బీసీసీఐ వారిని దులీప్ ట్రోఫీ నుంచి తప్పించిందా అన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు.
సంజూ శాంసన్, రహానే...
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్, హిట్టర్ రింకూ సింగ్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. వీరిద్దరితో పాటు ఛటేశ్వర్ పుజారా, రహానే, వెంకటేష్ అయ్యర్, హనుమ విహారి, పృథ్వీషా, అభిషేక్ శర్మ పేర్లు కూడా దులీప్ ట్రోఫీ ప్రాబబుల్స్‌లో కనిపించలేదు.
61 మంది క్రికెటర్లు...
దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచుల కోసం మొత్తం 61 మంది క్రికెటర్ల పేర్లను ప్రకటించిన బీసీసీఐ ఈ క్రికెటర్లను మాత్రం విస్మరించింది. దులీప్ ట్రోఫీకి దూరమైన ఈ క్రికెటర్లు అందరూ టీమిండియాలో చోటు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చూస్తూనే ఉన్నారు. రహానే, పుజారా, పృథ్వీషా టీమిండియాకు చోటు కోల్పోయి మూడు, నాలుగు ఏళ్లు దాటింది. సంజూ శాంసన్, రింకు సింగ్‌లకు అవకాశాలు వస్తోన్న తుది జట్టులో చోటు మాత్రం దక్కడం లేదు.
టీ20 వరల్డ్ కప్‌తో పాటు శ్రీలంక సిరీస్‌కు సెలెక్ట్ అయినా పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. హనుమ విహారి, వెంకటేష్ అయ్యర్ కూడా ఒకటి , రెండు సిరీస్‌లలో ఆడి మళ్లీ కనిపించలేదు. రానున్న నాలుగైదు నెలల్లో టీమిండియా పలు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో చోటు కోసం దులీప్ ట్రోఫీ రాణించాలని సత్తా చాటిన ఈ క్రికెటర్లను బీసీసీఐ ఎందుకు షాకిచ్చిందన్నది మాత్రం తెలియడం లేదు.
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్...
మరోవైపు దులీప్ ట్రోఫీలో ఏ టీమ్‌కు శుభ్‌మన్ గిల్, బీ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. సీ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్, డీ టీమ్‌కు శ్రేయస్ అయ్యర్ సారథులుగా కనిపించబోతున్నారు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ బీ టీమ్ తరఫున బరిలోకి దిగుతోన్నాడు.