తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sachin First Century: సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు.. బీసీసీఐ స్పెషల్ పోస్ట్

Sachin first century: సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు.. బీసీసీఐ స్పెషల్ పోస్ట్

Hari Prasad S HT Telugu

14 August 2023, 18:59 IST

google News
    • Sachin first century: సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. ఆ ఇన్నింగ్స్ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

Sachin first century: అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరూ కనీసం ఊహించని 100 సెంచరీల రికార్డు అందుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తన తొలి సెంచరీ చేసి సోమవారానికి (ఆగస్ట్ 14) సరిగ్గా 33 ఏళ్లు పూర్తయ్యాయి. 1990, ఆగస్ట్ 14న ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో 17 ఏళ్ల సచిన్.. తన తొలి అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేశాడు. అందులోనూ నాలుగో ఇన్నింగ్స్ లో చేసిన ఈ సెంచరీ.. ఆ మ్యాచ్ లో ఇండియాను ఓటమి నుంచి గట్టెక్కించింది.

ఈ సెంచరీని గుర్తు చేసుకుంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ఓ ట్వీట్ చేశారు. "1990లో ఇదే రోజు 17 ఏళ్ల సచిన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ ద్వారా ప్రపంచ క్రికెట్ లో ఓ గుర్తింపు సాధించాడు. అది కూడా ఇంగ్లండ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో మ్యాచ్ ను కాపాడిన సెంచరీ అది. ఆ సెంచరీ క్రికెట్ ఆటనే మార్చేసిన ఓ కొత్త శకానికి నాంది పలికింది" అని జై షా ఆ ట్వీట్ లో కొనియాడాడు.

1989లో 16 ఏళ్ల వయసులో తొలిసారి ఇండియన్ టీమ్ కు ఎంపికయ్యాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాతి ఏడాదే టెస్టులలో తన తొలి సెంచరీ సాధించాడు. 189 బంతుల్లో 17 ఫోర్లతో 119 పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు 17 ఏళ్ల సచిన్. ఆ తర్వాత మరో 99 సెంచరీలు చేసి క్రికెట్ గాడ్ గా మిగిలిపోయాడు.

200 టెస్టులు, 463 వన్డేల్లో 34 వేలకుపైగా రన్స్ చేసిన ఘనత సచిన్ సొంతం. అతని రికార్డులకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇప్పటికి మాస్టర్ రిటైరై పదేళ్లు పూర్తయింది. టెండూల్కర్ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం 75 సెంచరీలతో సచిన్ కు చేరువలో ఉన్నది ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే. ముఖ్యంగా వన్డేల్లో అతని 49 సెంచరీల రికార్డును కోహ్లి (46) అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా 100 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేస్తాడన్న అంచనాలు ఉన్నా.. అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు. సచిన్ టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426 రన్స్ చేయడం విశేషం. మరోవైపు కోహ్లి మాత్రం 25 వేలకుపైగా రన్స్ చేశాడు.

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం