BCCI Income Tax: ఇదీ బీసీసీఐ రేంజ్.. కళ్లు చెదిరే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన క్రికెట్ బోర్డు-cricket news bcci income tax is a new record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci Income Tax: ఇదీ బీసీసీఐ రేంజ్.. కళ్లు చెదిరే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన క్రికెట్ బోర్డు

BCCI Income Tax: ఇదీ బీసీసీఐ రేంజ్.. కళ్లు చెదిరే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన క్రికెట్ బోర్డు

Hari Prasad S HT Telugu
Aug 09, 2023 11:59 AM IST

BCCI Income Tax: ఇదీ బీసీసీఐ రేంజ్. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు అని ఎందుకంటారో మరోసారి నిరూపించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కళ్లు చెదిరే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టింది మన క్రికెట్ బోర్డు.

బీసీసీఐ
బీసీసీఐ (MINT_PRINT)

BCCI Income Tax: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో ఆ బోర్డు ప్రభుత్వానికి కట్టే ఆదాయ పన్ను కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ప్రతి ఏటా ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ మధ్యే ఐసీసీ నుంచి మెజార్టీ వాటా కూడా దక్కించుకుంది. 2024-27 మధ్య ఏకంగా 23 కోట్ల డాలర్లు ఐసీసీ నుంచి అందుకోనుంది.

దీంతో అదే స్థాయిలో ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ ఏకంగా రూ.1159 కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు వెల్లడించారు. బోర్డు ఫైల్ చేసిన రిటర్న్స్ ఆధారంగా బీసీసీఐ గత ఐదేళ్లలో సంపాదించిన మొత్తం, ఖర్చుల వివరాలను మంత్రి సభకు తెలిపారు.

కేవలం ఐసీసీ ద్వారానే ప్రతి ఏటా వందల కోట్లు అందుకుంటున్న బీసీసీఐకి ఇతర ఆదాయ మార్గాలు మరెన్నో ఉన్నాయి. అందులో ఐపీఎల్ ప్రధాన మార్గం. ఈ మెగా టోర్నీ ద్వారా బోర్డు ప్రతి ఏటా భారీగా సంపాదిస్తోంది. 2022 సీజన్ నుంచి మరో రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఆదాయం మరింత పెరిగింది. దీనికితోడు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్ లాంటి వాటి ద్వారా బోర్డు భారీగా సంపాదిస్తోంది.

ఏడాది వ్యవధిలోనే బోర్డు చెల్లించిన ఆదాయ పన్ను సుమారు రూ.300 కోట్ల వరకూ పెరిగిందంటే ఏ స్థాయిలో సంపాదిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను బీసీసీఐ ఆదాయ పన్ను రూపంలో రూ.844.92 కోట్లు, 2019-20లో రూ.882.29 కోట్లు చెల్లించింది.

ఇక 2021-22 ఏడాదికిగాను బీసీసీఐ మొత్తం ఆదాయం 7606 కోట్లుగా ఉంది. అందులో ఖర్చులు రూ.3064 కోట్లు కాగా.. మిగిలిన సుమారు రూ.4500 కోట్ల ఆదాయంపై బోర్డు పన్ను చెల్లించింది. రానున్న ఐదేళ్లలో ఈ ఆదాయం, దానితోపాటు పన్నులు కూడా మరింత భారీగా పెరగనున్నాయి.

Whats_app_banner