RR vs RCB IPL 2024: రాజస్థాన్, బెంగళూరుల్లో ఎలిమినేటర్‌లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పిన సునీల్ గవాస్కర్
22 May 2024, 17:01 IST
- RR vs RCB IPL 2024 Eliminator: ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‍పై హైప్ విపరీతంగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‍లో ఎవరు గెలుస్తారో తన అభిప్రాయన్ని వెల్లడించారు లెజెండ్ సునీల్ గవాస్కర్.
RCB vs RR IPL 2024: రాజస్థాన్, బెంగళూరుల్లో ఎలిమినేటర్‌లో ఎవరు గెలుస్తారో చెప్పిన సునీల్ గవాస్కర్
RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో భాగంగా ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. లీగ్ దశలో వరుసగా ఆరు అద్భుత విజయాలు సాధించి.. అసాధ్యమనుకున్న దశ నుంచి ప్లేఆఫ్స్ చేరింది బెంగళూరు. మరోవైపు ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ చివర్లో వరుసగా మ్యాచ్‍లు ఓడింది. అహ్మదాబాద్ వేదికగా నేడు (మే 22) రాజస్థాన్, బెంగళూరు జట్లు ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి.
ఈ ఎలిమినేటర్ మ్యాచ్‍లో గెలిచిన జట్టు మే 24న క్వాలిఫయర్-2లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో తలపడనుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సింది. కాగా, ఈ నేటి ఎలిమినేటర్ మ్యాచ్‍లో రాజస్థాన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఎవరు గెలుస్తారో తన అభిప్రాయాన్ని వెల్లడించారు టీమిండియా మాజీ బ్యాటర్, దిగ్గజం సునీల్ గవాస్కర్. ఈ మ్యాచ్‍లో బెంగళూరు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
ఆర్బీసీ అద్భుతం చేసింది
బెంగళూరు జట్టులో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లకు చాలా ప్రోత్సహిస్తున్నారని గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో చెప్పారు. “ఆర్సీబీ చేసింది అద్భుతానికి తక్కువేం కాదు. తాము మళ్లీ పుంజుకుంటామని వారిని వారు నమ్మారు. దాని కోసం సమ్‍థింగ్ స్పెషల్ ఉండాలి. ఆ జట్టు ప్రధాన ప్లేయర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మరికొందరు సీనియర్లు.. ఇతర ప్లేయర్లను బాగా ప్రోత్సహిస్తున్నారు” అని గవాస్కర్ చెప్పారు.
అలా జరగపోతే ఆశ్చర్యపోతా..
ఎలిమినేటర్‌లో రాజస్థాన్‍పై బెంగళూరు ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తాను అంచనా వేస్తున్నానని, అలా జరగకపోతే ఆశ్చర్యపోతా అని సునీల్ గవాస్కర్ చెప్పారు. “రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‍లు వరుసగా ఓడింది. గత మ్యాచ్‍లోనూ బాగా ఆడలేదు. వారికి ప్రాక్టీస్ కూడా సరిగా లేదు. కోల్‍కతా చేసినట్టు ఏదైనా స్పెషల్‍గా చేస్తే తప్ప.. ఈ మ్యాచ్ వన్‍సైడెడ్‍గానే ఉంటుంది. ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఆధిపత్యం చూపుతుంది. అయితే, మరో వన్‍సైడెడ్ మ్యాచ్ చూడాల్సి వస్తుందనేదే నా నిరాశ. ఒకవేళ అలా జరగపోతే నేను ఆశ్చర్యపోతా” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ దశలో తొలి 9 మ్యాచ్‍ల్లో 8 గెలిచిన శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుసగా నాలుగు ఓడింది. కోల్‍కతాతో జరగాల్సిన చివరి మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. దీంతో మూడో స్థానంతో సరిపెట్టుకొని ప్లేఆఫ్స్ చేరింది. మరోవైపు ఆర్సీబీ తొలి 8 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి.. ఆ తర్వాత వరుసగా ఆరు గెలిచి ప్లేఆఫ్స్ చేరింది. దీంతో ఈ ఎలిమినేటర్ పోరు రసవత్తరంగా మారింది. మరి, గవాస్కర్ అంచనా వేసినట్టు బెంగళూరు గెలుస్తుందో.. లేకపోతే రాజస్థాన్ పుంజుకొని విజయం సాధిస్తుందో చూడాలి.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) జరగగా సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై గెలిచి.. కోల్‍కతా నైట్‍రైడర్స్ ఫైనల్ చేరింది. నేటి ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మే 24న హైదరాబాద్‍తో క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26వ తేదీన ఫైనల్‍లో కోల్‍కతాతో తలపడుతుంది.