తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Dc: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

12 May 2024, 23:29 IST

google News
    • RCB vs DC IPL 2024: రాయల్ చాలెంజల్స్ బెంగళూరు ఫామ్ కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నేడు ఘనంగా గెలిచింది ఆర్సీబీ. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను బెంగళూరు ఇంకా నిలుపుకుంది. 
RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ
RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ (PTI)

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

RCB vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఆలస్యంగా భీకర ఫామ్‍లోకి వచ్చింది. ఈ సీజన్‍లో తొలి 8 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, ఒక్కటే గెలిచిన బెంగళూరు.. ఇప్పుడు వరుసగా ఐదు మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో నేడు (మే12) జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనంగా గెలిచింది. దీంతో వరుసగా ఐదో విజయంతో ఇంకా ప్లేఆఫ్స్ ఆశలను ఆర్సీబీ నిలుపుకుంది. ఈ సీజన్‍లో బెంగళూరుకు ఇది ఆరో గెలుపు. ఈ ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ వివరాలివే..

కోహ్లీ సూపర్ స్టార్ట్

టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు సాధించింది. ఆర్సీబీ స్టార్, ఓపెనర్ విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 27 పరుగులు; ఓ ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి దుమ్మురేపాడు. మూడు అద్భుత సిక్స్‌లతో అదగొట్టాడు. మంచి ఆరంభం ఇచ్చాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (7) ఔటైనా.. విరాట్ దూకుడుగా ఆడాడు. అయితే, నాలుగో ఓవర్లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాక.. ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‍లో కోహ్లీ ఔటయ్యాడు.

పాటిదార్, జాక్స్ మెరుపులు

అనంతరం విల్ జాక్స్ (29 బంతుల్లో 41 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హిట్టింగ్ చేశాడు. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత అర్ధ శకతం చేశాడు. జాక్స్, పటిదార్ దూకుడుగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వేగంగా రన్స్ వచ్చాయి. పాటిదార్, జాక్స్ మూడో వికెట్‍కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, అర్ధ శతకం తర్వాత 13వ ఓవర్లో పాటిదార్‌ను ఢిల్లీ బౌలర్ రసిక్ సలామ్ ఔట్ చేశాడు. కాసేపటికే విల్ జాక్స్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 14.4 ఓవర్లలో 137 పరుగులకు 4 వికెట్లతో ఆర్సీబీ కాస్త ఇబ్బందుల్లో పడింది. మహిపాల్ లోమ్రోర్ (13) కాసేపు నిలువగా.. చివర్లో దినేశ్ కార్తీక్ (0), స్వప్నిల్ సింగ్ (0), కర్ణ్ శర్మ (6) విఫలమయ్యారు. మొత్తంగా ఆర్సీబీ 187 రన్స్ చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్, ఖలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఈ పోరులో అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేశాడు. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఈ మ్యాచ్‍లో ఢిల్లీ కొంప ముంచాయి.

ఢిల్లీ టపటపా.. అక్షర్ పోరాటం

లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ నిరాశపరిచింది. బెంగళూరు బౌలర్లు సమిష్టిగా సత్తాచాటారు. 19.1 ఓవర్లలో 140 పరుగులకే ఢిల్లీ ఆలౌటై భారీ ఓటమి మూటగట్టుకుంది. డేవిడ్ వార్నర్ (1), అభిషేక్ పోరెల్ (2) విఫలమవగా.. జోరుగా ఆడుతున్న జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (21) దురదృష్టకర రీతిలో నాన్‍స్ట్రయికర్ ఎండ్‍లో రనౌట్ అయ్యాడు. కుమార కుషాగ్ర (2) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. షాయ్ హోప్ (29) కాసేపు నిలిచాడు. స్టాండిన్ కెప్టెన్ అక్షర్ పటేల్ 39 బంతుల్లోనే 57 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శకతంతో మెరిపించాడు. అక్షర్ పోరాటంతో మళ్లీ ఢిల్లీ మ్యాచ్‍లోకి వచ్చేలా కనిపించింది. అయితే, 16వ ఓవర్లో అక్షర్‌ను ఔట్ చేసి ఢిల్లీ ఆశలకు ముగింపు పలికాడు ఢిల్లీ పేసర్ యశ్ దయాళ్. చివర్లో మిగిలిన ఢిల్లీ బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ మూడు, లూకీ ఫెర్గ్యూసన్ రెండు వికెట్లతో అదరగొట్టారు. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.

బెంగళూరుకు ఆశలు ఇంకా..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 6 విజయాలు, ఏడు ఓటములు సాధించింది. 12 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్ దశలో ఆర్సీబీ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మే 18వ తేదీన చెన్నైతో జరిగే మ్యాచ్‍లో భారీగా గెలిస్తే బెంగళూరుకు ప్లేఆఫ్స్ ఆశలు ఉండొచ్చు. అయితే, మిగిలిన జట్ల సమీకరణాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‍ల్లో 6 విజయాలు, ఏడు ఓటములను చెందింది. అయితే, నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండడం ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ ఉన్నా.. ఢిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టమే. లక్నోతో తన చివరి లీగ్ మ్యాచ్‍ను మే 14న ఢిల్లీ ఆడనుంది.

తదుపరి వ్యాసం