Team India: రోహిత్, కోహ్లీ, బుమ్రాను ఆ టోర్నీలో ఆడించాల్సింది: భాతర మాజీ ప్లేయర్
28 August 2024, 21:41 IST
- Team India: దులీప్ ట్రోఫీ నుంచి భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్నారు. ఈ టోర్నీకి బీసీసీఐ వారిని ఎంపిక చేయలేదు. అయితే, వారిని ఆ టోర్నీ ఆడించాల్సిందని భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. విశ్రాంతికి సంబంధించి కొన్ని లెక్కలు పేర్కొన్నారు.
Team India: రోహిత్, కోహ్లీ, బుమ్రాను ఆ టోర్నీలో ఆడించాల్సింది: భాతర మాజీ ప్లేయర్
ఈ ఏడాది దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో టీమిండియాకు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లు కూడా అందరూ బరిలోకి దిగాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‍తో టెస్టులు సహా డిసెంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఆడనుంది. అందుకే సన్నాహకంగా దులీప్ ట్రోఫీలో టీమిండియా ప్లేయర్లు కూడా ఆడాలని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సూచించింది. అయితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. ఈ టోర్నీ ఆడకూడదని డిసైడ్ అయ్యారు. దీంతో వారికి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు.
అయితే, దులీప్ ట్రోఫీకి రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ముగ్గురిని కూడా ఎంపిక చేయాల్సిందని నేడు (ఆగస్టు 28) ట్వీట్ చేశారు.
రోహిత్ 59 శాతం, కోహ్లీ 61 శాతం
గత ఐదేళ్లలో ఇండియా ఆడిన వాటిల్లో ఎంత శాతం మ్యాచ్‍లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా ఆడారో పేర్కొన్నారు మంజ్రేకర్. వారికి ఇప్పుడు దులీప్ ట్రోఫీకి విశ్రాంతి అవసరం లేదనేలా అభిప్రాయపడ్డారు.
ఆ ముగ్గురికి విశ్రాంతి బాగానే దొరికిందని తనకు అనిపిస్తోందని మంజ్రేకర్ తెలిపారు. “గత ఐదేళ్లలో ఇండియా 249 అంతర్జాతీయ మ్యాచ్‍లు ఆడింది. వీటిలో రోహిత్ శర్మ 59 శాతం మ్యాచ్‍లు ఆడాడు. విరాట్ 61 శాతం, బుమ్రా 34 శాతం ఆడారు. వారికి బాగా రెస్ట్ దొరికిందని నాకు అనిపిస్తోంది. వీరు దులీప్ ట్రోఫీకి ఎంపిక కావాల్సింది” అని మంజ్రేకర్ ట్వీట్ చేశారు.
గవాస్కర్ కూడా..
భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఇటీవలే ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా ఆడాల్సిందని అన్నారు. రెస్ట్ ఇవ్వడంత బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్‍ను వారు మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే ఆడాల్సి వస్తోందని తెలిపారు. ఎక్కువ కాలం ఆటకు దూరం ఉంటే మళ్లీ లయ అందుకునేందుకు టైమ్ పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. దులీప్ ట్రోఫీ టోర్నీ సెప్టెంబర్ 5న మొదలుకానుంది.
జై షా ఏం చెప్పారంటే..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లను దేశవాళీ ట్రోఫీ ఆడాలని బలవంతపెట్టకూడదని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ప్లేయర్లను గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. “రోహిత్, విరాట్ లాంటి ప్లేయర్లను దులీప్ ట్రోఫీ ఆడాలని మనం బలవంతం చేయకూడదు. గాయం రిస్క్ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍లోనూ ప్రతీ అంతర్జాతీయ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడరు. మనం ప్లేయర్లను గౌరవంగా చూసుకోవాలి” అని జై షా చెప్పారు.
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‍లు
టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‍తో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు సెప్టెంబర్ 19న మొదలుకానుంది. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్టు జరగనుంది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ సాగనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‍తో భారత్ మూడు టీ20ల సిరీస్‍లో తలపడుతుంది. అక్టోబర్ 6న తొలి టీ20, అక్టోబర్ 9న రెండో మ్యాచ్, అక్టోబర్ 12 మూడో టీ20 జరుగుతుంది.