Rohit Sharma: గిల్‍ను వెనక్కి నెట్టి ర్యాంకింగ్‍ల్లో రోహిత్ శర్మ పైకి.. శ్రీలంకతో సిరీస్ ఎఫెక్ట్-rohit sharma moves 2nd spot in icc odi batting rankings after sri lanka series he just behind babar azam ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: గిల్‍ను వెనక్కి నెట్టి ర్యాంకింగ్‍ల్లో రోహిత్ శర్మ పైకి.. శ్రీలంకతో సిరీస్ ఎఫెక్ట్

Rohit Sharma: గిల్‍ను వెనక్కి నెట్టి ర్యాంకింగ్‍ల్లో రోహిత్ శర్మ పైకి.. శ్రీలంకతో సిరీస్ ఎఫెక్ట్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 05:57 PM IST

Rohit Sharma - ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్‍ల్లో మరింత పైకి వెళ్లాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే బ్యాటింగ్ లిస్టులో రెండో ర్యాంకుకు ఎగబాగాడు. శుభ్‍మన్ గిల్‍ను వెనక్కి నెట్టేశాడు హిట్‍మ్యాన్.

Rohit Sharma: గిల్‍ను వెనక్కి నెట్టి ర్యాంకింగ్‍ల్లో రోహిత్ శర్మ పైకి.. శ్రీలంకతో సిరీస్ ఎఫెక్ట్
Rohit Sharma: గిల్‍ను వెనక్కి నెట్టి ర్యాంకింగ్‍ల్లో రోహిత్ శర్మ పైకి.. శ్రీలంకతో సిరీస్ ఎఫెక్ట్ (AFP)

శ్రీలంకతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా.. మూడు మ్యాచ్‍ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మూడు వన్డేల్లో 157 పరుగులతో రాణించాడు. వరుసగా 58, 64, 35 పరుగులతో రాణించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‍ను 0-2తో భారత్ కోల్పోయింది. అయితే, ఆ సిరీస్‍లో బ్యాటింగ్‍లో దుమ్మురేపిన రోహిత్ శర్మ.. ఐసీసీ నేడు వెల్లడించిన తాజా ర్యాంకింగ్‍ల్లోపైకి ఎగబాకాడు.

రెండో ర్యాంకుకు హిట్‍మ్యాన్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో రెండో స్థానానికి రోహిత్ శర్మ ఎగబాకాడు. శ్రీలంకతో సిరీస్‍తో దుమ్మురేపటంతో ఓ ప్లేస్ మెరుగుపరుచుకొని రెండో ర్యాంకుకు వెళ్లాడు. భారత యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్‍ను వెనక్కి నెట్టాడు. లంకతో అంతగా రాణించని గిల్.. రెండో ర్యాంకు నుంచి మూడుకు దిగాడు. 765 రేటింగ్ పాయింట్లతో వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో ప్రస్తుతం రోహిత్ శర్మ రెండో ర్యాంకుకు చేరగా.. శుభ్‍మన్ గిల్ (763 పాయింట్లు) మూడో ప్లేస్‍కు వెళ్లాడు. మొత్తంగా భారత్ తరఫున టాప్ ర్యాంకర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో ప్రస్తుతం పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (824) టాప్ ప్లేస్‍లో కొనసాగుతున్నాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ (746) నాలుగో ర్యాంకులో ఉన్నాడు. ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టార్ (746) ఓ స్థానం మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు వచ్చాడు. మొత్తంగా టాప్-5లో ముగ్గురు భారత బ్యాటర్లే ఉన్నారు.

లంక ప్లేయర్ల ర్యాంకులు మెరుగు

భారత్‍తో వన్డే సిరీస్‍లో రాణించిన శ్రీలంక ఆటగాళ్ల ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. ఈ సిరీస్‍లో 103 రన్స్ చేసిన పాతుమ్ నిస్సంక.. వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో పది నుంచి తొమ్మిది ర్యాంకుకు చేరాడు. కుషాల్ మెండిస్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని 39వ ప్లేస్‍కు వచ్చాడు. అవిష్క ఫెర్నాండో 20 స్థానాలు ఎగబాకి 68వ ర్యాంకుకు చేరాడు.

టెస్టుల్లోనూ రోహితే

ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లోనూ భారత తరఫున అత్యుత్తమ ర్యాంక్ ప్రస్తుతం రోహిత్ శర్మదే. ప్రస్తుతం టెస్టుల్లో 6వ ర్యాంకులో హిట్‍మ్యాన్ ఉండగా.. యశస్వి జైస్వాల్ 8వ ప్లేస్‍లో ఉన్నారు. టెస్టు బ్యాటింగ్‍లో భారత్ తరఫున వీరిద్దరే టాప్-10లో ఇప్పుడు ఉన్నారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లోనూ రెండో ప్లేస్‍కు రోహిత్ శర్మ వచ్చేశాడు. దీంతో రెండు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున ప్రస్తుతం అత్యుత్తమ ర్యాంకర్‌గా రోహిత్ ఉన్నాడు. 37 ఏళ్ల వయసులో అద్భుత ఫామ్‍తో రెచ్చిపోతున్నాడు.

ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్‍ను కైవసం చేసుకున్న తర్వాత.. అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‍బై చెప్పేశాడు. భారత్ తరఫున ఇక టెస్టులు, వన్డేలు ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‍గా కొనసాగుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి ఆ ఫార్మాట్‍కు రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడయ్యాడు.

టీమిండియా నెక్స్ట్ సిరీస్

టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‍తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 మధ్య ఈ సిరీస్‍లు జరగనున్నాయి.