Jay Shah: ఆ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బలవంత పెట్టకూడదు: జై షా
Jay Shah: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారంటూ ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, వారు ఈ టోర్నీ ఆడడం లేదని జట్ల ప్రకటన తర్వాత తెలిసిపోయింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
దేశవాళీ క్రికెట్ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’లో ఈసారి టీమిండియా ఆటగాళ్లు చాలా మంది బరిలోకి దిగుతున్నారు. దీంతో స్టార్ ప్లేయర్లతో ఈ టోర్నీ కళకళలాడనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ మినహా దాదాపు మిగిలిన టీమిండియా ప్లేయర్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడనున్నారు. బుమ్రాకు ముందుగానే విశ్రాంతి అనుకోగా.. బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్‍కు ముందు దులీప్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడతారనే రూమర్లు వచ్చాయి. అయితే, ఈ టోర్నీ ఆడకూడదని వారు డిసైడ్ అయ్యారు.
దులీప్ ట్రోఫీ కోసం టీమ్ ఏ, టీమ్ బీ, టీమ్ సీ, టీమ్ డీ జట్లను బీసీసీఐ ఇటీవలే వెల్లడించింది. వీటిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేరు. దీంతో వారు ఈ టోర్నీ ఆడడం లేదని స్పష్టత వచ్చింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ఇంటర్య్వూలో నేడు స్పందించారు.
వారిని బలవంత పెట్టకూడదు
దేశవాళీ టోర్నీలు ఆడాలంటూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లను బలవంత పెట్టకూడదని జై షా అన్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‍కు వారు ఫిట్‍గా ఉండేలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దేశవాళీ టోర్నీ ఆడితే రోహిత్, కోహ్లీకి గాయం రిస్క్ కూడా ఉంటుందని, ఆ ఛాన్స్ తీసుకోకూడదని అనుకుంటున్నట్టు జై షా వెల్లడించారు. “దులీప్ ట్రోఫీ ఆడాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లను బలవంతం చేయకూడదు. గాయం రిస్క్ కూడా ఉంటుంది. మీరు గమనిస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍లో అంతర్జాతీయ ప్లేయర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడరు. మనం ప్లేయర్లను గౌరవంతో చూసుకోవాలి” అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై షా అన్నారు.
ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్.. బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్న విషయాన్ని జై షా చెప్పారు. “వారిద్దరు (కోహ్లీ, రోహిత్) మిగిలిన వారు దులీప్ ట్రోఫీ ఆడతారు. దాన్ని మనం అభినందించాలి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్నారు” అని జై షా చెప్పారు.
అందుకే డే నైట్ టెస్టులు నిర్వహించడం లేదు
భారత్‍లో డే నైట్ టెస్టులు ఎందుకు నిర్వహించడం లేదనే ప్రశ్నకు కూడా జై షా స్పందించారు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‍లో చివరగా డే నైట్ టెస్టుకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత భారత గడ్డపై పింక్ బాల్ డే నైట్ టెస్టు జరగలేదు.
డై నైట్ టెస్టు మ్యాచ్‍లు త్వరగా ముగుస్తున్నాయని, అందుకే వీటిని నిర్వహించేందుకు సుముఖంగా లేమని జై షా చెప్పారు. భారత్ వేదికగా జరిగిన డై నైట్ టెస్టులన్నీ మూడు రోజుల్లోనే ముగిశాయి. “ఐదు రోజుల మ్యాచ్ కోసం మీరు టికెట్ కొంటారు. కానీ 2-3 రోజుల్లోనే మ్యాచ్ అయిపోతుంది. దీనివల్ల ప్రేక్షకులు నష్టపోతారు. బ్రాడ్‍కాస్టర్లకు ఆదాయం పోతుంది. ఇలా అయితే రీఫండ్ ఉండదు. దీనిపై నేను కాస్త ఎమోషనల్‍గా ఉన్నా” అని జై షా చెప్పారు.
అయితే, సాధారణ టెస్టు మ్యాచ్‍లు కూడా కొన్ని మూడు రోజుల్లోనే అయిపోతున్నాయన్న ప్రశ్నకు కూడా జై షా స్పందించారు. ప్రత్యర్థి జట్టు సరిగా ఆడకపోతే తాము ఏం చేయగలమని చెప్పారు. “ప్రత్యర్థి జట్టు సరిగా ఆడకపోతే.. నేనేం చేయగలను? మన ప్లేయర్లు బాగా ఆడుతుంటే.. గేమ్‍ను ఇంకా ఆలస్యం చేయండని నేను చెప్పలేను” అని జై షా అన్నారు.
టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‍లో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‍లు ఆడనుంది. టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19న మొదలుకానుంది.