Rohit sharma: ఐపీఎల్ 2025 వేలంలోకి రోహిత్ శర్మ? - 25 కోట్లకు కొనడానికి ఫ్రాంచైజీలు పోటీ!
24 July 2024, 9:08 IST
Rohit sharma: ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వీడనున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఐపీఎల్ 2025 వేలంలో రోహిత్ శర్మ ఇరవై ఐదు కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్ల చెబుతోన్నారు.
రోహిత్ శర్మ
Rohit sharma: ఐపీఎల్ 2025లో కొత్త టీమ్ తరఫున రోహిత్ శర్మ బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కు త్వరలోనే అతడు గుబ్‌బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. సారథిగా, బ్యాటింగ్ పరంగా రోహిత్‌కు ఉన్న అనుభవం తమ టీమ్‌లకు బాగా ఉపయోగపడుతోందని ఫ్రాంచైజ్ యాజమాన్యాలు భావిస్తోన్నట్లు తెలిసింది.
కెప్టెన్సీ మార్పు వల్లే...
2024 ఐపీఎల్‌లో రోహిత్ శర్మను కాదని ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ ఐపీఎల్‌లో పాండ్యసారథ్యంలో ముంబై ఇండియన్స్ పూర్తిగా తేలిపోయింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. పాండ్యకు ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ అప్పగించే విషయంలో రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
కెప్టెన్సీ మార్పుకు సంబంధించి రోహిత్ అభిప్రాయాలు, సూచనలు మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోలేదని, పాండ్య విఫలమైనా అతడినే సీజన్ మొత్తానికి కెప్టెన్‌గా కొనసాగించడం కూడా జట్టులోని కొందరు ఆటగాళ్లు నచ్చలేదని వార్తలొస్తున్నాయి.
కెప్టెన్సీ మార్పు వల్లే రోహిత్‌కు ముంబై యాజమాన్యానికి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ కూడా రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను రిటెన్షన్ చేయడానికి సుముఖంగా లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగు టీమ్స్...
ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధానికి రోహిత్ తొందరలోనే ముంగిపు పలకడం ఖాయమని అంటున్నారు. 2025 ఐపీఎల్ వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజ్‌లు ఇప్పటినుంచే ప్రణాళికలను వేస్తోన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం అవసరమైతే ఇరవై ఐదు కోట్లు కూడా వెచ్చించడానికి ఈ టీమ్‌లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఆర్‌సీబీ కెప్టెన్‌గా...
ఆర్‌సీబీకి డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో ఉన్న డుప్లెసిస్ నెక్స్ట్ సీజన్‌కు ఫిట్‌గా ఉంటాడా లేదా అన్నది అనుమానంగానే మారింది. కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో రోహిత్‌ను వేలంలో దక్కించుకోవాలని ఆర్‌సీబీ ఆలోచిస్తోన్నట్లు సమాచారం. అతడికే కెప్గెన్సీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా జట్టును నడిపించే సమర్థవంతమైన నాయకుడి కొరత చాలా ఏళ్లుగా వేధిస్తోంది. కెప్టెన్సీ వైఫల్యం వల్లే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కప్ గెలవలేకపోతుందనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. విన్నింగ్ కెప్టెన్ కోసం ఎదురుచూస్తోన్న పంజాబ్ వేలంలో రోహిత్ కోసం పోటీపడే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
పంత్ స్థానంలో...
ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ పంత్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. నెక్స్ట్ సీజన్ కోసం జట్టులో పలు మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఛేంజెస్‌లో భాగంగానే వేలంలోకి రోహిత్ వస్తే అతడిని ఇరవై కోట్లకుపైనే ధర వెచ్చించి అయినా దక్కించుకోవాలని అనుకుంటోన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి. లక్నో జట్టును కెప్టెన్ రాహుల్ వీడనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఐపీఎల్‌లో టీమ్ ఓనర్‌తో కేఎల్ రాహుల్‌కు మధ్య జరిగిన గొడవ క్రికెట్ వర్గాలను కుదిపేసింది. ఈ సీజన్‌లో లక్నో ఫెయిల్యూర్స్‌కు కెప్టెన్ కారణమంటూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో రాహుల్ కలత చెందినట్లు తెలిసింది. లక్నో నుంచి తప్పుకొని ఆర్‌సీబీలో చేరాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు సమాచారం. రాహుల్ స్థానాన్ని రోహిత్‌తో లక్నో భర్తీ చేయవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.