Rohit Sharma: అత్యధిక సిక్స్‌ల రికార్డ్ రోహిత్ దే - పంజాబ్ మ్యాచ్‌లో బ్రేక్ అయిన ఐపీఎల్ రికార్డుల ఇవే
19 April 2024, 8:53 IST
Rohit Sharma:పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కష్టపడి తొమ్మిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మూడు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. అవి ఏవంటే?
రోహిత్ శర్మ
Rohit Sharma: ఐపీఎల్‌లో గురువారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమాలకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో తొమ్మిది రన్స్ తేడాతో పంజాబ్‌పై ముంబై విజయం సాధించింది. ఒకనొక దశలో ముంబై ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచేలా కనిపించింది. కానీ చివరలో అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. పంజాబ్‌ను గెలుపు వరకు తీసుకొచ్చాడు. కానీ చివరలో అతడిని కోయిట్జ్ బోల్తా కొట్టించడంతో పంజాబ్ ఓటమి పాలైంది.
ధోనీ రికార్డ్ సమం...
కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మూడు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 250 మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఈ రికార్డును సాధించిన రెండో ప్లేయర్ రోహిత్ మాత్రమే కావడం గమనార్హం. అతడి కంటే ముందు ఈ రికార్డును ధోనీ సాధించాడు. ధోనీ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 256 మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ కూడా ఈ సీజన్‌లోనే 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. ధోనీతో పాటు రోహిత్ ఇద్దరు 2008 లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ధోనీ, రోహిత్ తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో దినేష్ కార్తిక్ మూడో స్థానంలో ఉన్నాడు. దినేష్ కార్తిక్ ఇప్పటివరకు 249 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 244 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతోన్నాడు.
6500 పరుగులు...
ఐపీఎల్‌లో పంజాబ్ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ 6500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 6500 పరుగులు పూర్తిచేసుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో 7624 పరుగులతో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ (6769 రన్స్), డేవిడ్ వార్నర్ (6563) పరుగులతో సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో కొనసాగుతోన్నారు. 6508 ర న్స్‌తో పంజాబ్ మ్యాచ్ ద్వారా రోహిత్ నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ తర్వాత 5528 రన్స్‌తో సురేష్ రైనా ఐదో స్థానంలో నిలిచాడు.
అత్యధిక సిక్స్‌లు...
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బాల్స్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 36 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా పొల్లార్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 224 సిక్సర్లు బాదగా...పొల్గార్డ్ 223 సిక్స్‌లు కొట్టాడు. 104 సిక్స్‌లతో హార్దిక్ పాండ్య మూడో స్థానంలో నిలవగా...103 సిక్స్‌లతో ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో కొనసాగుతోన్నాడు.
సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 192 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 78 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ 36, తిలక్ వర్మ 34 రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. 193 పరుగుల టార్గెట్‌లో బరిలో దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ 28 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 61 రన్స్ చేశాడు. శశాంక్ సింగ్ 41 రన్స్‌తో రాణించాడు. వారిద్దరు మినహా మిగిలిన వారు విఫలం కావడంతో పంజాబ్ ఓటమి పాలైంది. బుమ్రా, కోయిట్జ్ తలో మూడు వికెట్లతో పంజాబ్‌ను దెబ్బకొట్టారు. కాగా పంజాబ్‌పై విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరుకున్నాడు.