తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్: వైరల్ అవుతున్న వీడియో

Rishabh Pant: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్: వైరల్ అవుతున్న వీడియో

03 March 2024, 23:32 IST

google News
    • Rishabh Pant Viral Video: భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్.. చిన్నపిల్లలతో రోడ్డు పక్కన గోళీలాట ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Rishabh Pant: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్: వైరల్ అవుతున్న వీడియో
Rishabh Pant: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్: వైరల్ అవుతున్న వీడియో

Rishabh Pant: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్: వైరల్ అవుతున్న వీడియో

Rishabh Pant: భారత యువ స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడు.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ మైదానంలో బరిలోకి దిగలేదు. గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍లో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఆడలేదు. ఇప్పుడిప్పుడే పంత్ కోలుకుంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో అతడు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.

కాగా, రిషబ్ పంత్ ఆదివారం రోడ్డు పక్కన చిన్నపిల్లలతో గోళీలతో ఆట ఆడాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు పంత్. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్‍గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ ఆటలో లెక్కలు కూడా కట్టాడు రిషబ్ పంత్. తన స్కోరు ఎంత అని పిల్లలను అతడు అడగడం కూడా వీడియోలో ఉంది. ఈ వీడియోను తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పంత్ పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

పిల్లలతో రిషబ్ పంత్ గోళీలాట ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. పంత్‍కు చిన్నతనం గుర్తొచ్చినట్టుందని కొందరు ఈ వీడియోకు కామెంట్లు చేశారు. పిల్లల్లో భలే కలిసిపోయాడని మరికొందరు రాసుకొచ్చారు. పంత్ ఎంత స్టార్ అయినా.. అణకువగా ఉంటాడనేందుకు ఇది మరో రుజువు అని మరికొందరు పోస్టులు చేశారు. పంత్ పూర్తిగా ఫిట్‍గా కనిపిస్తుండడంపై చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు పంత్. అయితే, పట్టుదలతో తీవ్రంగా శ్రమించి అంచనా వేసిన దాని కంటే వేగంగా కోలుకున్నాడు. సంవత్సరానికి పైగా అతడు ఆటకు దూరమయ్యాడు. మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్‍కు ఎన్‍సీఏ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని టీమిండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ ఇటీవల తెలిపారు. మార్చి 5వ తేదీన పంత్‍కు అనుమతి లభిస్తుందని అన్నారు. అయితే, పంత్‍కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ అప్పగించే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్‍సీఏ క్లియరెన్స్ వచ్చాక రిషబ్ పంత్‍కు కెప్టెన్సీ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గంగూలీ చెప్పాడు. ఒకవేళ కేవలం బ్యాటర్‌గానే పంత్ ఆడినా.. తమకు వేరే వికెట్ కీపింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని తెలిపాడు. ఎన్‍సీఏ అనుమతి వచ్చాక ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‍లోకి పంత్ వస్తాడని దాదా స్పష్టం చేశాడు.

గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ దూరంగా కాగా.. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేశాడు. అయితే, గతేడాది ఆ జట్టు అంచనాలను ఏ మాత్రం అందుకోలేక నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. పంత్ మళ్లీ వస్తే ఈ ఏడాది ఐపీఎల్‍లో ఢిల్లీకి చాలా ప్లస్ కానుంది.

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న షురూ కానుంది. ఇప్పటికే ఈ సీజన్‍లో తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వెల్లడించింది. ఆ తర్వాతి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం