Rishabh Pant World Record: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. గిల్‌క్రిస్ట్, సంగక్కర వరల్డ్ రికార్డు బ్రేక్
21 June 2024, 17:23 IST
- Rishabh Pant World Record: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. గురువారం (జూన్ 20) ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో గిల్‌క్రిస్ట్, సంగక్కరలాంటి వాళ్లను అధిగమించాడు.
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. గిల్‌క్రిస్ట్, సంగక్కర వరల్డ్ రికార్డు బ్రేక్
Rishabh Pant World Record: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో టీ20 వరల్డ్ కప్ లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అతడు సృష్టించడం విశేషం. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్, గిల్‌క్రిస్ట్, సంగక్కర పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. గురువారం (జూన్ 20) ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో పంత్ ఈ ఘనత సాధించాడు.
రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు
ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంత్ 20 పరుగులే చేసినా.. వికెట్ కీపింగ్ లో మాత్రం రాణించాడు. ఈ మ్యాచ్ లో అతడు మూడు క్యాచ్ లు అందుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో ఇప్పటికే 10 ఔట్లలో పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ గా పంత్ నిలిచాడు.
గతంలో ఈ రికార్డు లెజెండరీ వికెట్ కీపర్లు ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, కుమార సంగక్కర పేరిట ఉండేది. ఈ ముగ్గురూ ఒకే టీ20 వరల్డ్ కప్ లో 9 ఔట్లలో పాలుపంచుకున్నారు. ఇప్పుడా రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో అంతు రెహ్మనుల్లా గుర్బాజ్, గుబ్లదిన్ నాయిబ్, నవీనుల్ హక్ ఇచ్చిన క్యాచ్ లను అందుకోవడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
గతంలో 2021లో టీ20 వరల్డ్ కప్ లోనూ రిషబ్ పంత్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అయితే ఆ టోర్నీలో ఇండియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. ఇక 2022లో పంత్ బదులు దినేష్ కార్తీక్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
బ్యాటింగ్‌లోనూ పంత్ మెరుపులు
కారు ప్రమాదం జరిగిన ఏడాదిన్నర తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన పంత్.. బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ అతడే. నాలుగు మ్యాచ్ లలో పంత్ 116 రన్స్ చేశాడు. సగటు 38.66 కాగా.. స్ట్రైక్ రేట్ 131.81. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లోనూ అతడు 11 బంతుల్లోనే 20 రన్స్ చేశాడు.
కోహ్లి, రోహిత్ లాంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమవుతున్న వేళ మూడో స్థానంలో వస్తూ పంత్ రాణిస్తుండటం విశేషం. ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో 26 బంతుల్లో 36, పాకిస్థాన్ పై 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్ లలోనూ టీమిండియా ఘన విజయాలు సాధించింది. ఇక సూపర్ 8 మ్యాచ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ లోనే గెలిచి టీమిండియా శుభారంభం చేసింది.
ఆఫ్ఘనిస్థాన్ ను ఏకంగా 47 పరుగులతో చిత్తు చేసి గ్రూప్ 1లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ తో శనివారం (జూన్ 22), ఆస్ట్రేలియాతో సోమవారం (జూన్ 24) మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
టాపిక్