Rishabh Pant: పంత్ ఓ మిరాకిల్ కిడ్.. అతనితో జాగ్రత్త: ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్
24 September 2024, 15:43 IST
- Rishabh Pant: రిషబ్ పంత్ ఓ మిరాకిల్ కిడ్ అని.. అతనితో జాగ్రత్త అని ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన పంత్ పై అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
పంత్ ఓ మిరాకిల్ కిడ్.. అతనితో జాగ్రత్త: ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్
Rishabh Pant: రిషబ్ పంత్ సుమారు ఏడు వందల రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో కాస్త కుదురుకున్నట్లు కనిపించిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా మూడంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో అతనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాను హెచ్చరించాడు.
పంత్ ఓ సూపర్ హ్యూమన్
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో సెంచరీ చేసిన రిషబ్ పంత్ ఓ సూపర్ హ్యూమన్ అని వసీమ్ అక్రమ్ అన్నాడు. "పంత్ ప్రదర్శన చూడండి. అలాంటి విషాదం నుంచి బయటపడి ఇలాంటి అద్భుతం చేశాడంటే తానో సూపర్ హ్యూమన్ అని నిరూపించుకున్నాడు. అతనికి జరిగిన ప్రమాదం చూసి పాకిస్థాన్ లో మేమంతా ఆందోళన చెందాం. నేను కూడా ఆందోళన చెంది అతని గురించి ట్వీట్ చేశాను" అని వసీమ్ అక్రమ్ అన్నాడు.
ఆ ప్రమాదం వల్ల రిషబ్ పంత్ గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి రావడంతోనే ఇలా ఆడటంతో అతడో స్పెషల్ అని అక్రమ్ అన్నాడు. "అతడు టెస్ట్ క్రికెట్ ను ఎలా ఆడేవాడో చూశాం. ఆస్ట్రేలియాలో అప్పట్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ తోనూ అలాగే ఆడాడు. ఆండర్సన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కొట్టాడు. కమిన్స్ బౌలింగ్ లోనూ. అతడు స్పెషల్" అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
పంత్ ఓ మిరాకిల్ కిడ్: అక్రమ్
కమ్‌బ్యాక్ లోనే ఇలా ఆడటం ద్వారా తన మానసిక బలం, ధైర్యం ఎంతలా ఉన్నాయో అర్థమవుతోందని ఈ సందర్భంగా అక్రమ్ అన్నాడు. పంత్ ఓ మిరాకిల్ కిడ్ అని కొనియాడాడు. "ఆ భయానక ప్రమాదం తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. దాని నుంచి కోలుకొని ఇలా బలంగా పుంజుకోవడం చూస్తుంటే మానసికంగా అతడు ఎంత బలంగా ఉన్నాడో అర్థమవుతోంది.
ప్రపంచంలోని యువతను మోటివేట్ చేయడానికి అతని స్టోరీని రాబోయే తరాలకు చెప్పాలి. పంత్ లాగా మీరు కూడా కమ్ బ్యాక్ చేయొచ్చని చెప్పొచ్చు. అతడు తిరిగి వచ్చిన తర్వాత ఐపీఎల్లో 40 సగటుతో రన్స్ చేశాడు. 155 స్ట్రైక్ రేట్ తో 446 రన్స్ చేశాడు. అతడో మిరాకిల్ కిడ్" అని అక్రమ్ అన్నాడు.
డిసెంబర్ 30, 2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తిరిగి కోలుకొని క్రికెట్ లో అడుగుపెట్టడానికి ఏడాదికిపైనే పట్టింది. ఐపీఎల్ తోనే మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో తన ఫేవరెట్ టెస్ట్ ఫార్మాట్లోకి వచ్చాడు.