Rishabh Pant: బంగ్లాదేశ్‍కు ఫీల్డింగ్ సెట్ చేయడంపై స్పందించిన రిషబ్ పంత్.. ఏం చెప్పాడంటే!
Rishabh Pant - IND vs BAN: బంగ్లాదేశ్ కోసం ఫీల్డింగ్ సెట్ చేసి ఆశ్చర్యపరిచాడు భారత్ బ్యాటర్ రిషబ్ పంత్. బంగ్లా కెప్టెన్ కూడా అతడు చెప్పిన మాటను విన్నాడు. ఈ టెస్టు ముగిశాక ఈ విషయంపై పంత్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు తన స్టైల్‍లో ఆన్సర్ చెప్పాడు.
బంగ్లాదేశ్‍పై టీమిండియా భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‍లో దుమ్మురేపి బంగ్లాను చిత్తుచేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‍లో 1-0తో ముందడుగు వేసింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (సెప్టెంబర్ 22) 280 పరుగుల తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా గెలిచింది. 21 నెలల తర్వాత టెస్టు ఆడిన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ శతకంతో చెలరేగాడు. అలాగే, తన మార్క్ కామెంట్లు, చర్యలతో ఫన్ కూడా పంచాడు. బ్యాటింగ్ చేస్తున్న పంత్ ఓ దశలో బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేసేశాడు.
ఈ తొలి టెస్టు మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో రిషబ్ పంత్ చేసిన ఓ పని అవాక్కయ్యేలా చేసింది. బంగ్లాదేశ్‍కు ఫీల్డింగ్ సూచనలు చేశాడు. మిడ్ వికెట్‍లో ఫీల్డర్‌ను పెట్టాలని బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతోకు చెప్పాడు. అతడు అది ఫాలో అయ్యాడు. నేడు భారత్ మ్యాచ్ గెలిచాక ఈ విషయంపై పంత్‍ను కామెంటేటర్ సబా కరీమ్ ప్రశ్నించాడు.
బంగ్లా కెప్టెన్ నువ్వా.. శాంతోనా?
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కోసం ఫీల్డింగ్ ఎందుకు సెట్ చేశావని రిషబ్ పంత్‍ను సబా కరీం ప్రశ్నించాడు. “నేను ఓ ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెండో ఇన్నింగ్స్‌లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఫీల్డింగ్ సెట్ చేశావ్. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంతోనా.. నువ్వా?” అని పంత్‍ను సబా కరీమ్ ప్రశ్నించారు. దీనికి పంత్ తన మార్క్ ఫన్నీ ఆన్సర్ చెప్పాడు.
అందుకే సెట్ చేశా..
భారత మాజీ ప్లేయర్ అజయ్ జడేజా తనకు గతంలో ఓ మాట చెప్పారని పంత్ గుర్తు చేసుకున్నాడు. తనది అయినా.. ప్రత్యర్థి జట్టుదైనా మ్యాచ్‍లో ఆట క్వాలిటీ ఎప్పుడూ అత్యుత్తమంగా ఉండాలని అజయ్ తనతో చెప్పారని పంత్ తెలిపాడు.
ఇద్దరు ఫీల్డర్లు ఒకే చోట ఉండటంతో తాను బంగ్లాదేశ్‍కు సూచనలు ఇచ్చానని పంత్ అన్నాడు. “నేను మైదానం బయట అజయ్ జడేజాతో ఎక్కువగా మాట్లాడతా. క్రికెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండాలని ఆయన చెబుతుంటారు. నువ్వు ఆడుతున్నా.. ప్రత్యర్థి జట్టుదైనా ఆట నాణ్యతతో ఉండాలని ఆయన అంటారు. మిడ్ వికెట్‍లో ఏ ఫీల్డర్ లేరని నేను గమనించా. అదే సమయంలో ఇద్దరు ఫీల్డర్లు ఒకే చోట ఉన్నారు. దీంతో ఓ ఫీల్డర్ మిడ్‍వికెట్‍కు వెళ్లాలని నేను సూచించా. అక్కడ ఫీల్డర్‌ను ఉంచాలని శాంతోకు చెప్పా” అని పంత్ తన మార్క్ సమాధానం ఇచ్చాడు.
ధోనీతో పోలికపై..
ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో తన ఆరో సెంచరీని రిషబ్ పంత్ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును అతడు సమం చేశాడు. ఈ తరుణంలో ధోనీతో పంత్‍ను చాలా మంది పోలుస్తున్నారు. ఈ విషయంపై కూడా పంత్ స్పందించాడు. తనను ధోనీతో పోల్చవద్దని తాను ఇంతకు ముందు కూడా చెప్పానని పంత్ చెప్పాడు. తాను తనలాగే ఉంటానని అన్నాడు. ధోనీ చాలా క్రికెట్ ఆడారని రిషబ్ చెప్పాడు.