Ravichandran Ashwin: వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ రావడం ఖాయమే!
25 September 2023, 7:56 IST
- Ravichandran Ashwin: వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అతడు.. సీనియర్ బౌలర్ గా తన సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin: వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా సిరీస్ కోసం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. 20 నెలలుగా అసలు వన్డేలు ఆడని ప్లేయర్ ను కేవలం మూడు వన్డేల సిరీస్ లో ఆడించి వరల్డ్ కప్ కోసం ట్రై చేయడం ఏంటని ప్రశ్నించారు. కానీ జట్టులో తన విలువేంటో అతడు నిరూపించుకున్నాడు.
ఆసియా కప్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడటంతో అనూహ్యం అశ్విన్ కు పిలుపు వెళ్లింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ గా, బ్యాటింగ్ కూడా చేయగలిగే ప్లేయర్ గా అక్షర్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అశ్విన్ కే ఉందని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. వాళ్లు తనపై పెట్టుకున్న ఆశలను అశ్విన్ వమ్ము చేయలేదు.
వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఖాయం
37 ఏళ్ల అశ్విన్ ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. స్వదేశీ పిచ్ లపై ఇప్పటికీ తాను మ్యాచ్ విన్నర్ నే అని నిరూపించాడు. మూడు వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటర్ల పని పట్టాడు. లబుషేన్, వార్నర్, జోష్ ఇంగ్లిస్ లాంటి కీలకమైన వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లెఫ్టామ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండే ప్రత్యర్థులపై అశ్విన్ అవసరం ఎంతైనా ఉందని చాలా రోజులుగా క్రికెట్ పండితులు చెబుతున్నారు.
తొలి వన్డేలో ఒక వికెట్ తీసిన అశ్విన్.. రెండో మ్యాచ్ లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. అక్షర్ ఒకవేళ వరల్డ్ కప్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే అశ్విన్ ను తీసుకోవడం తప్ప మరొక అవకాశం లేదు. ఈ సిరీస్ కు ముందు గత ఆరేళ్లలో అశ్విన్ ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ ఆ ప్రభావం అతని బౌలింగ్ పై ఎంతమాత్రం కనిపించలేదు.
రెండో వన్డేలో కీలకమైన సమయంలో లబుషేన్, వార్నర్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు అశ్విన్. లబుషేన్ వికెటే మ్యాచ్ ను మలుపు తిప్పింది. అతడు ఔటైన తర్వాత ఆస్ట్రేలియా మిడిలార్డర్ కుప్పకూలింది. వరల్డ్ కప్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తానని చెప్పిన అశ్విన్.. చెప్పినట్లే వచ్చాడు. తానేంటో నిరూపించాడు. ఇక అతడు వరల్డ్ కప్ టీమ్ లోకి రావడమే ఆలస్యం.
టాపిక్