Ashwin - Jadeja: ఆరేళ్ల తర్వాత వన్డేలో అశ్విన్ - జడేజా కాంబో-ravichandran aswin ravindra jadeja combo back for india in odis after 6 years ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Ravichandran Aswin Ravindra Jadeja Combo Back For India In Odis After 6 Years

Ashwin - Jadeja: ఆరేళ్ల తర్వాత వన్డేలో అశ్విన్ - జడేజా కాంబో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2023 02:02 PM IST

Ashwin - Jadeja: భారత వన్డే జట్టులో చాలా కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా కాంబినేషన్ రిపీట్ అయింది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అశ్విన్ భారత తుది జట్టులోకి వచ్చాడు.

Ashwin - Jadeja: ఆరేళ్ల తర్వాత వన్డేలో అశ్విన్ - జడేజా కాంబో (Photo: BCCI)
Ashwin - Jadeja: ఆరేళ్ల తర్వాత వన్డేలో అశ్విన్ - జడేజా కాంబో (Photo: BCCI)

Ashwin - Jadeja: భారత వన్డే జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ వచ్చేశాడు. టెస్టుల్లో ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్న అశ్విన్‍కు వన్డే జట్టులో మాత్రం చాలా కాలంగా చోటు దక్కడం లేదు. అయితే, అక్షర్ పటేల్ గాయపడటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్‍లో టీమిండియాలోకి వచ్చేశాడు అశ్విన్. నేడు (సెప్టెంబర్ 22) ఆసీస్‍తో జరుగుతున్న తొలి వన్డేల్లో భారత తుదిజట్టులో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. సుమారు 20 నెలల తర్వాత భారత తరఫున వన్డే ఆడుతున్నాడు అశ్విన్. ఈ తరుణంలో భారత వన్డే జట్టులో మళ్లీ స్పిన్ స్టార్స్ అశ్విన్ - రవిచంద్ర జడేజా కాంబో ఈ మ్యాచ్‍లో రిపీట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి ఒకే వన్డేలో ఆడడం గత ఆరు సంవత్సరాల్లో ఇదే తొలిసారి. వన్డే మ్యాచ్‍లో అశ్విన్, జడేజా కాంబో ఆరు సంవత్సరాల తర్వాత రిపీట్ అయింది. వీరిద్దరూ కలిసి ఆడిన చివరి వన్డే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనలే. ఆ తర్వాతి నుంచి భారత వన్డే జట్టులో అశ్విన్ - జడేజా కాంబో రాలేదు. జడేజా వన్డేలు కూడా వరుసగా ఆడుతున్నాడు. అయితే, అశ్విన్‍కు వన్డేల్లో చాలా అరుదుగా అవకాశాలు దక్కాయి. ఆ సమయాల్లో జడేజా తుదిజట్టులో లేడు. దీంతో వన్డేల్లో వీరి కాంబోకు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది.

2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత క్రికెట్ మేనేజ్‍మెంట్.. వన్డేల్లో మణికట్టు స్పిన్నర్స్ అయిన కుల్‍దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‍కే మొగ్గుచూపింది. దీంతో అశ్విన్‍కు 50 ఓవర్ల క్రికెట్‍లో ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. టెస్టులకే పరిమితమయ్యాడు. టెస్టుల్లో అయితే అశ్విన్, జడేజా కాంబో కొనసాగుతోంది.

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‍ కోసం కుల్‍దీప్ యాదవ్‍కు బ్యాకప్‍గా రవిచంద్రన్ అశ్విన్‍ను టీమిండియా మేనేజ్‍మెంట్ ఆలోచించింది. అయితే, ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో అక్షర్ పటేల్‍ గాయపడటంతో ఆ స్థానం కోసం కూడా అశ్విన్‍ను పరిగణనలోకి తీసుకుంటోంది. అశ్విన్ బ్యాటింగ్ కూడా మెరుగ్గా చేయగలడు. మరోవైపు, వాషింగ్టన్ సుందర్ కూడా అశ్విన్‍కు పోటీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరగుంది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్‍ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.

ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు భారత తుది జట్టు: శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.