Ravi Shastri: కోహ్లి, రోహిత్ కాదు.. ఆ ఇద్దరే టీ20 వరల్డ్ కప్ గెలిపించేది: రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
07 May 2024, 9:06 IST
- Ravi Shastri: టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియాను గెలిపించేది ఎవరో మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. అయితే అది విరాట్ కోహ్లియో, రోహిత్ శర్మనో కాదని అతని మాటలను బట్టి స్పష్టమవుతోంది.
కోహ్లి, రోహిత్ కాదు.. ఆ ఇద్దరే టీ20 వరల్డ్ కప్ గెలిపించేది: రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ravi Shastri: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నారు. బహుశా వీళ్ల కెరీర్లలో ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. దీనిని గెలవడానికి వాళ్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రకారం.. ఈసారి టీమిండియాలో కీలకపాత్ర పోషించేది మాత్రం వీళ్లు కాదట.
ఆ ఇద్దరే కీలకం
రవిశాస్త్రి చెబుతున్నదాని ప్రకారం టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించేది ఇద్దరు యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబె కావడం విశేషం. ఈ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది. అయితే యశస్వి ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో ఆడిన తీరు, శివమ్ దూబె ప్రస్తుతం ఐపీఎల్లో మెరుస్తున్న విధానం చూస్తుంటే ఈ ఇద్దరే టీ20 వరల్డ్ కప్ లో కీలకం కానున్నారని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
"ఈసారి జాగ్రత్తగా గమనించాల్సిన ఇద్దరు జెంటిల్మెన్ వీళ్లే. ఆ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే. అందులో ఒకరు జైస్వాల్. అతని గురించి మనకు చాలా తెలుసు. ఇంగ్లండ్ తో చాలా బాగా ఆడాడు. టాపార్డర్ లో దంచి కొడతాడు. లెఫ్ట్ హ్యాండర్, యువకుడు. భయం లేకుండా షాట్స్ ఆడగలడు" అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న శివమ్ దూబెపైనా ప్రశంసలు కురిపించాడు.
శివమ్ దూబె మ్యాచ్ విన్నర్
ఈ సీజన్లో శివమ్ దూబె కేవలం 11 మ్యాచ్ లలో 26 సిక్స్ లు బాదాడు. రెండు ఐపీఎల్ సీజన్లలో రాణించి ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. "మిడిలార్డర్ లో మరో ప్లేయర్ ఉన్నాడు. అతన్ని కూడా చూడండి. ఎందుకంటే అతడు కూడా ధాటిగా ఆడతాడు. విధ్వంసకర బ్యాటర్, మ్యాచ్ విన్నర్. సరదా కోసం సిక్స్ లు బాదేస్తాడు. స్పిన్ బౌలింగ్ అయితే ఇక చంపేస్తాడు. కరీబియన్ దీవుల్లోని చిన్న గ్రౌండ్లలో కొన్ని బాల్స్ ను అతడు స్టేడియం బయటకు పంపించేస్తాడు. అతడు అలాంటి ప్లేయర్. భారీ షాట్లు ఆడతాడు" అని రవిశాస్త్రి అన్నాడు.
"స్పిన్నర్లే కాదు ఫాస్ట్ బౌలర్ల విషయంలోనూ అతడు తన ఆటను మెరుగుపరచుకున్నాడు. అందుకే అతడు ఐదు లేదా ఆరో స్థానాల్లో కీలకం. ఎందుకంటే ఒక్కసారిగా కష్టాల్లో పడితే 20, 25 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడానికి ఒకరు అవసరం. అతడు అలాంటి ప్లేయరే" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అంతేకాదు వరల్డ్ కప్ లో టీమ్ భారీ స్కోర్లు చేయడంలోనూ దూబెదే కీలకపాత్ర కానుందనీ అన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో శివమ్ దూబె ఏకంగా 170.73 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధిస్తున్నాడు. "అతని స్ట్రైక్ రేట్ చాలా వరకూ 200 వరకు ఉంటోంది. ఇది ఇండియన్ టీమ్ కు చాలా ఉపయోగపడనుంది. టీ20 వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో పెద్ద మ్యాచ్ లలో ఆ 190లు, 200లు చేయడం చాలా ముఖ్యం. అందుకే శివమ్ దూబె ఆటను ఎంజాయ్ చేయండి" అని రవిశాస్త్రి చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. ఇండియా తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుండగా.. జూన్ 9న పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ జరగనుంది.
టాపిక్