Ravi Shastri on Team India: టీమిండియాకు రవిశాస్త్రి పంచ్.. వైరల్ అవుతున్న ఫన్నీ కామెంట్స్
04 January 2024, 13:33 IST
- Ravi Shastri on Team India: సౌతాఫ్రికాపై ఒక్క పరుగూ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాపై మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు వేసిన పంచ్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
టీమిండియాపై రవిశాస్త్రి ఫన్నీ కామెంట్స్ వైరల్
Ravi Shastri on Team India: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు దక్కిన అడ్వాంటేజ్ ను తిరిగి హోస్ట్ టీమ్ చేతుల్లోనే పెట్టింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో 4 వికెట్లకు 153 రన్స్ తో పటిష్ఠంగా కనిపించినా.. అదే స్కోరు దగ్గర మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ సందర్భంగా కామెంటరీ బాక్స్ లో ఉన్న మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాత్ రూమ్‌కు వెళ్లి వచ్చేలోపే టీమిండియా 4 వికెట్ల నుంచి ఆలౌటైందంటూ రవిశాస్త్రి లైవ్ కామెంటరీలో అనడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ టీమ్ ను ఆలౌట్ చేసి సౌతాఫ్రికా గ్రౌండ్ బయట అడుగు పెట్టే సమయంలో శాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు. అతని కామెంట్స్ తో చాలా మంది నిజమే కదా అంటూ ఏకీభవించారు.
"అవును 153 పరుగులకు 4 వికెట్ల నుంచి 153 పరుగులకే ఆలౌటైంది. ఎవరైనా బాత్‌రూమ్ కు వెళ్లి తిరిగి వచ్చేలోపే ఇండియా 153 పరుగుల దగ్గర ఆలౌటవడం చూసి షాక్ తింటారు" అని రవిశాస్త్రి అన్నాడు. అతని కామెంట్స్ కు పక్కనే ఉన్న మరో కామెంటేటర్ పామీ ఎంబాగ్వా పడీపడీ నవ్వుతూ అతడు కూడా మరో పంచ్ వేశాడు.
"ఓ డ్రింక్ లేదా ఏదైనా పని కోసం వెళ్లినా సరే. ఆట నుంచి కాసేపు పక్కకెళ్లిన వాళ్లందరూ షాక్ తింటారు" అని ఎంబాగ్వా నవ్వుతూ అన్నాడు. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియన్ టీమ్.. మ్యాచ్ పై పట్టు బిగించింది అనుకునులోపే తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన తీరు షాక్ కు గురి చేసింది.
11 బంతులు.. 0 పరుగులు.. 6 వికెట్లు
ఒక దశలో 4 వికెట్లకు 153 రన్స్ తో మంచి లీడ్ సాధించే దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కోహ్లి, రాహుల్ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో రాహుల్ ఔటవడంతో వికెట్ల పతనం మొదలైంది. కేవలం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఇండియన్ టీమ్ మిగిలిన ఆరు వికెట్లు కోల్పోవడం నమ్మశక్యంగా అనిపించలేదు.
పిచ్ కాస్త పేసర్లకు అనుకూలిస్తున్నా.. మరీ 55 పరుగులకే ఆలౌటయ్యే పిచ్ కాదని తొలి రోజు మ్యాచ్ తర్వాత సిరాజ్ అన్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చివర్లో పేకమేడలా కుప్పకూలడం షాక్ కు గురి చేసేదే. చివరి టీమ్ లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. రబాడా, ఎంగిడి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. మరోవైపు సౌతాఫ్రికా 97 ఏళ్ల తర్వాత తమ టెస్ట్ క్రికెట్ లో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసింది. పేస్ కు అనుకూలించిన కేప్‌టౌన్ పిచ్ పై తొలి రోజే 23 వికెట్లు పడటం కూడా సరికొత్త రికార్డే. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 36 పరుగులు వెనుకబడే ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు మొదట్లోనే ఇండియన్ పేసర్లు చెలరేగితే.. మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.
టాపిక్