Gavaskar on KL Rahul: ఇదీ కేఎల్ రాహుల్ అసలు సత్తా: గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసల వర్షం-gavaskar and ravi shastri praise kl rahul after his fifty on first day in the first test against south africa ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Kl Rahul: ఇదీ కేఎల్ రాహుల్ అసలు సత్తా: గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసల వర్షం

Gavaskar on KL Rahul: ఇదీ కేఎల్ రాహుల్ అసలు సత్తా: గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu
Dec 27, 2023 08:46 AM IST

Gavaskar on KL Rahul: కేఎల్ రాహుల్ అసలు సత్తా ఇదీ అంటూ మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి రోజు రాహుల్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్ పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్, రవిశాస్త్రి
కేఎల్ రాహుల్ పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్, రవిశాస్త్రి

Gavaskar on KL Rahul: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి రోజే అక్కడి బౌన్సీ పిచ్‌లు పరీక్ష పెట్టిన వేళ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్ స్కోరును 200 దాటించాడు. దీంతో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదీ రాహుల్ అసలు సత్తా అని ఆకాశానికెత్తారు.

కగిసో రబాడా నిప్పులు చెరుగుతూ రోహిత్, కోహ్లి, శ్రేయస్ లాంటి బ్యాటర్లను పెవిలియన్ కు పంపించగా.. రాహుల్ మాత్రమే సఫారీల పేస్ దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. దీంతో తొలి రోజు ఆట తర్వాత గవాస్కర్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారిపోయిందని అనడం విశేషం.

రాహుల్ హాఫ్ సెంచరీ.. ఓ సెంచరీయే

"చాలా రోజులుగా అతని టాలెంట్ ఏంటో మనకు తెలుసు. కానీ గత కొన్ని నెలలుగా దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఐపీఎల్లో అయిన గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత పూర్తి భిన్నమైన రాహుల్ ను మనం చూస్తున్నాం. చాలా రోజులుగా ఈ రాహుల్ నే చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ హాఫ్ సెంచరీ సెంచరీలాంటిదే అని కామెంటరీలో చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను" అని గవాస్కర్ అన్నాడు.

ఆసియా కప్ నుంచి రాహుల్ చెలరేగిపోతున్నాడని గవాస్కర్ అన్నాడు. "అన్ని రోజుల పాటు ఎంతో ఇష్టపడిన ఆటకు దూరమైన తర్వాత ఆ ప్లేయర్ దృక్పథం పూర్తిగా మారిపోతుంది. రాహుల్లో అదే చూస్తున్నాం. రాహుల్ ప్రతి అడుగులోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. గతంలో అతడు కాస్త బెరకుగా కనిపించేవాడు. ఇప్పుడలా కాదు.

ఆసియా కప్ లో సెంచరీతో అది నిరూపించాడు. శ్రేయస్ గాయం ఒక రకంగా రాహుల్ కు కలిసి వచ్చింది. జీవితంలో ఇలా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ దానిని కూడా మనం సద్వినియోగం చేసుకోగలగాలి. అదే రాహుల్ చేసింది. మూడు ఫార్మాట్లలోనూ ఇప్పుడతన్ని తొలగించలేని పరిస్థితి" అని గవాస్కర్ అన్నాడు.

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా రాహుల్ పై ప్రశంసలు కురిపించాడు. "బ్యాటింగ్ చాలా సులువు అన్నట్లుగా ఆడాడు. అతని ఫుట్‌వర్క్, బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో అతనికీ స్థానం సరిగ్గా సరిపోతుందని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది. మిడిలార్డర్ లో అతడు చాలా రన్స్ చేయగలడు" అని రవిశాస్త్రి అన్నాడు.

Whats_app_banner