Gavaskar on Mumbai Indians: రోహిత్ అలసిపోయాడు.. పాండ్యాకు కెప్టెన్సీ మంచిదే: గవాస్కర్
Gavaskar on Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించడాన్ని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. రోహిత్ అలసిపోయాడని ఈ సందర్భంగా సన్నీ అనడం గమనార్హం.
Gavaskar on Mumbai Indians: ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ జట్టులో ఉండగానే కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించడం చాలా మందిని ఆశ్చర్యానికి, అసహనానికి గురి చేసిన విషయం తెలుసు కదా. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. రోహిత్ అలసిపోయాడని, హార్దిక్ కెప్టెన్సీ ముంబైకి మేలు చేస్తుందని స్పష్టం చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన గవాస్కర్.. రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "తప్పొప్పుల గురించి మాట్లాడాల్సిన పనిలేదు. కానీ వాళ్లు టీమ్ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ గత రెండేళ్లుగా బ్యాట్ తోనూ రాణించలేకపోయాడు. అంతకుముందు భారీ స్కోర్లు చేసేవాడు. కానీ గత రెండేళ్లలో టీమ్ ప్రదర్శన దెబ్బతింది. గతేడాది మాత్రం ప్లేఆఫ్స్ కు అర్హత సాధించారు" అని గవాస్కర్ అన్నాడు.
"అంతకుముందు ఏళ్లలో రోహిత్ శర్మలో కనిపించిన దూకుడు కనిపించలేదు. నిరంతరంగా క్రికెట్ ఆడుతుండటం వల్లనో లేదంటే ఇండియన్ టీమ్, ఫ్రాంఛైజీలకు కెప్టెన్సీ వల్లనో అలసిపోయినట్లునన్నాడు. హార్దిక్ యువ కెప్టెన్. తమకు కావాల్సిన ఫలితాలను అందించగలడనే కెప్టెన్సీ ఇచ్చినట్లు నాకు అనిపిస్తోంది. గుజరాత్ టైటన్స్ ను రెండుసార్లు ఫైనల్ చేర్చాడు. ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
ఇక కెప్టెన్ గా సక్సెసైన గుజరాత్ టైటన్స్ ను వదిలేసి హార్దిక్ ఎందుకు ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చాడన్నదానిపైనా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మిడ్ డేకు రాసిన మరో కాలమ్ లో గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "హార్దిక్ పాండ్యా ఎందుకు గుజరాత్ టైటన్స్ ను వదిలేసి ముంబైకి వెళ్లాడన్న చర్చ ఇప్పటికీ నడుస్తోంది.
కానీ గతంలో ఎంతమంది విదేశాల్లో విజయవంతమైన ఇండియన్స్ తిరిగి స్వదేశానికి రాలేదు? ముంబై ఇండియన్స్ తనకు ఇల్లులాంటిదన్న విషయం హార్దిక్ ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. ముంబై ఇండియన్స్ లోని కుటుంబ వాతావరణం ఎలాంటిదో దీనిని బట్టే తెలుస్తోంది" అని గవాస్కర్ అన్నాడు.