Ind vs SA 2nd Test Day 1: ఒకేరోజు 23 వికెట్లు.. 153 పరుగులకే భారత్ ఆలౌట్.. చరిత్రలో చెత్త రికార్డ్
India vs South Africa 2nd Test Day 1: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. చివరి సెషన్‌లో ఏకంగా 6 వికెట్స్ కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది.
India vs South Africa 2nd Test Day 1: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ ఆధిక్యాన్ని చేజిక్కించుకునే మంచి అవకాశాన్ని కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత పేలవమైన ప్రదర్శన చూపించింది. టీ విరామ సమయానికి 4 వికేట్లు కోల్పోయి 111 పరుగలతో పటిష్టంగా కనిపించిన భారత్ క్రికెట్ టీమ్ తర్వాత 153 రన్స్‌కే కుప్పకూలిపోయింది.

టీమ్ ఇండియా చివరి సెషన్‌లో తమ లాస్ట్ ఆరు వికెట్స్‌ను ఒకే స్కోర్ వద్ద అంటే 153 పరుగుల వద్ద కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమి చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. అలాంటి చెత్త ఘనతను టీమ్ ఇండియా తెచ్చుకున్నట్లు అయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్స్ తీసి భారత్ వశం కానున్న మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న టీమ్ ఇండియా స్కోర్ 11 బంతుల అనంతరం అదే 153 పరుగులకు ఆలౌట్‌గా మారింది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్స్ కాగా విరాట్ కోహ్లీ (46) , రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36) మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. ఇక భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ కార్డ్ చూస్తే అందరివి సున్నా పరుగులే. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం భారత్ ప్లేయర్స్ స్కోర్లు 0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్‌గా ఉన్నాయి.
భారత్ ఇన్నింగ్స్ ఆఖరులో ఒకే ఓవర్‌లో లుంగి ఎంగిడి.. కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్ బుమ్రా (0)లను పెవిలియన్‌కు పంపాడు. లుంగి ఎంగిడి (6-1-30-3), రబాడ (11.5-2-38-3)తో అదరగొట్టారు. వీరికి నండ్రే బర్గర్ మరింత తోడయ్యాడు. బర్గర్ కూడా మూడు వికెట్స్ తీయగా సిరాజ్ రనౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 98 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇక అంతకుముందు సౌతాఫ్రికాపై భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా లంచ్ సమయంలోపు 55 పరుగులకే ఆలౌట్ అయింది. కేప్‌టౌన్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అయితే, సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. బుమ్రా, ముకేష్ చెరో రెండు వికెట్స్ పడగొట్టారు. సిరాజ్ మొత్తం 9 ఓవర్లలో కేవలం 15 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీయడం విశేషంగా మారింది. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5, అంతకన్నా ఎక్కువ వికెట్స్ తీయడం సిరాజ్‌కు ఇది మూడోసారి.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లంచ్ విరామంలోపు 23.2 ఓవరల్లో ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండు అంకెల స్కోర్స్ చేశారు. అయితే, భారత్ ఆటగాళ్లలా కాకుండా సౌతాఫ్రికా ప్లేయర్లలో ఒక్కరు మాత్రమే డకౌట్ అయ్యారు. మిగతా బ్యాటర్స్ కనీసం ఒక్క పరుగైనా చేసి పర్వాలేదనిపించుకున్నారు.
మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇంకా 36 పరుగుల వెనుకబడి ఉంది. ఇక తొలి రోజు ఆటలో మొత్తంగా 23 వికెట్స్ పడ్డాయి. 27 మంది ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. రెండో రోజు తొలి సెషన్‌లో భారత్ బౌలర్స్ చెలరేగితే మ్యాచ్ డిసెంబర్ 4నే అంటే గురువారమే ముగిసే అవకాశం ఉంది.