Ranji Trophy: ముంబై 42వ సారి.. విదర్భను చిత్తు చేసి రంజీ ట్రోఫీ గెలిచిన ఛాంపియన్ టీమ్
14 March 2024, 14:08 IST
- Ranji Trophy: ఇండియాలో అత్యుత్తమ దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీని 42సారి గెలిచింది ముంబై టీమ్. ఫైనల్లో చివరి రోజు విదర్భను 169 పరుగులతో చిత్తు చేసి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకుంది.
ముంబై 42వ సారి.. విదర్భను చిత్తు చేసి రంజీ ట్రోఫీ గెలిచిన ఛాంపియన్ టీమ్
Ranji Trophy: రంజీ ట్రోఫీ మరోసారి ముంబై చేతుల్లోకి వెళ్లింది. విదర్భతో జరిగిన ఫైనల్లో ఆ టీమ్ ఘన విజయం సాధించింది. చివరి రోజైన గురువారం (మార్చి 14) 169 పరుగులతో విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ బాగానే పోరాడినా.. చివరికి 368 పరుగులకు ఆలౌటైంది. ఈ భారీ విజయంతో ముంబై 42వసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది.
ముంబైదే పైచేయి
రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్ ఆసక్తికరంగా సాగింది. రెండు జట్లూ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్లు నమోదు చేయడంతో చివరి రోజు రెండో సెషన్ వరకూ ఫైనల్ ఉత్కంఠ రేపింది. తొలి ఇన్నింగ్స్ లో విదర్భ.. కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 538 పరుగుల లక్ష్యం ముందున్నా ఆ టీమ్ అద్భుతంగా పోరాడింది.
చివరి రోజు ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 248 పరుగులతో చేజింగ్ కొనసాగించిన విదర్భ.. మరో 120 పరుగులు జోడించి ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102) సెంచరీతో తన టీమ్ ను లక్ష్యం వైపు నడిపించాలని అనుకున్నా.. ఫలితం లేకపోయింది. కరుణ్ నాయర్ (74), హర్ష్ దూబె (65) కూడా హాఫ్ సెంచరీలతో పోరాడారు. నిజానికి నాలుగో రోజే మ్యాచ్ ముగుస్తుందని అనుకున్నా.. ఈ ముగ్గురి పోరాటంతో మ్యాచ్ చివరి రోజు వరకూ వచ్చింది.
ముంబై బౌలర్లలో తనుష్ కొటియన్ 4 వికెట్లతో రాణించాడు. ముంబై రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ముషీర్ ఖాన్ కూడా 2 వికెట్లు తీసి బౌలింగ్ లోనూ తన టీమ్ విజయానికి కారణమయ్యాడు. ఈ విజయంతో ముంబై టీమ్ రంజీ ట్రోఫీని 42వసారి గెలిచి తన రికార్డును మరింత మెరుగుపరచుకుంది.
ఫైనల్లో ముంబై టీమ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకే ఆలౌటైనా.. తర్వాత విదర్భను 105 పరుగులకే కట్టడి చేసి మళ్లీ పట్టు బిగించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ముషీర్ ఖాన్ సెంచరీ, శ్రేయస్ హాఫ్ సెంచరీతో 418 పరుగులు చేసి.. విదర్భ ముందు ఏకంగా 538 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అప్పుడే ముంబై టైటిల్ విజయాన్ని ఖాయం చేసుకుంది. విదర్భ రెండు రోజుల పాటు పోరాడినా.. కొండంత లక్ష్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయింది.
రంజీ ట్రోఫీ కింగ్ ముంబై
రంజీ ట్రోఫీలో మొదటి నుంచీ ముంబైదే పైచేయి. ఈ మెగా డొమెస్టిక్ టోర్నీలో ఆ టీమ్ కు దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. ముంబై టీమ్ ఇప్పటి వరకూ అత్యధికంగా 42సార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత 8 ట్రోఫీలతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. దీనిని బట్టే ఈ టోర్నీలో ముంబై ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఢిల్లీ 7 సార్లు, బరోడా 5, మధ్యప్రదేశ్ 5 సార్లు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలిచాయి. ఇప్పుడు ముంబై చేతుల్లో ఫైనల్లో ఓడిన విదర్భ గతంలో రెండుసార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. తమిళనాడు, సౌరాష్ట్ర, రాజస్థాన్, రైల్వేస్, మహారాష్ట్ర, హైదరాబాద్ కూడా రెండేసిసార్లు ఈ ట్రోఫీ గెలిచాయి. బెంగాల్ మూడుసార్లు విజేతగా నిలిచింది.