MUM vs TN: 47వ సారి ఫైనల్ చేరిన ముంబై.. శార్దూల్ ఠాకూర్ ఆల్‍రౌండ్ షో
Ranji Trophy 2024 - MUM vs TN: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‍లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ సత్తాచాటాడు. దీంతో తమిళనాడుపై ముంబై భారీ విజయం సాధించి ఫైనల్ చేరింది.
MUM vs TN: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టులో మరోసారి సత్తాచాటింది. రంజీ చరిత్రలో 47వ సారి ఆ టీమ్ ఫైనల్‍కు అర్హత సాధించింది. ముంబై వేదికగా జరిగిన ఈ ఏడాది రంజీ ట్రోఫీ సెమీఫైనల్‍లో ముంబై జట్టు ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో తమిళనాడుపై నేడు (మార్చి 4) విజయం సాధించింది. దీంతో అజింక్య రహానే నేతృత్వంలోని ముంబై టీమ్ ఫైనల్‍కు దూసుకెళ్లింది. మూడు రోజుల్లోనే ఈ సెమీస్ మ్యాచ్ ముగిసింది.
మ్యాచ్ మూడో రోజైన నేడు తమిళనాడు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే చాపచుట్టేసింది. ముంబై బౌలర్ షామ్స్ ములానీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. టీమిండియా స్టార్ శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తనుష్ కోటియన్, మోహిత్ అవస్తి కూడా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. తమిళనాడు బ్యాటర్లలో బాబ్ ఇంద్రజిత్ (70) మినహా మరెవరూ ఎక్కువసేపు నిలువలేకపోయారు.
అంతకు ముందు 353 పరుగులకు 9 వికెట్ల స్కోరు వద్ద మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించింది ముంబై టీమ్. తుషార్ దేశ్‍పాండే (26) ఔటవడటంతో 378 పరుగులకు ఆలౌటైంది. దీంతో 232 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో ఆ స్కోరు కూడా చేరుకోలేక 162 పరుగులకే ఆలౌటై.. ఇన్నింగ్ పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146 పరుగులకే ఆలౌటైంది.
శార్దూల్ ఆల్ రౌండ్ ధమాకా
భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ముంబై తరఫున ఈ సెమీస్ మ్యాచ్‍లో ఆల్ రౌండ్ షో చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో తమిళ బ్యాటర్లు సాయి సుదర్శన్, విజయ్ శంకర్‌లను ఔట్ చేశాడు శార్దూల్. ఆ తర్వాత బ్యాటింగ్‍లో సెంచరీ బాదాడు.
ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో శార్దూల్ ఠాకూర్ విజృంభించాడు. కేవలం 105 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విజృభించాడు. ఈ కీలకమైన సెమీఫైనల్‍లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ముంబైను ఆదుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‍లోనూ శార్దూల్ ఠాకూర్ అదరగొట్టాడు. 10 ఓవర్లలో 16 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. తమిళనాడు ఓపెనర్లు నారాయణ్ జగదీషన్ (0), సాయిసుదర్శన్ (5)ను వెనువెంటనే ఔట్ చేశాడు. ముంబైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మిగిలిన ముంబై బౌలర్లు కూడా విజృంభించడంతో తమిళనాడు కుప్పకూలింది.
బ్యాటింగ్‍లో అద్భుత సెంచరీ చేయడంతో పాటు మ్యాచ్ మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కొంతకాలంగా ఫామ్‍లో లేకపోవటంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు శార్దూల్. అయితే, రంజీలో అదరగొట్టి మరోసారి తన సత్తానిరూపించుకున్నాడు.
రంజీ చరిత్రలో ముంబై అత్యంత సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ఉంది. ఆ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ చేరడం ఇది 47వ సారి. ఇప్పటి వరకు 41సార్లు టైటిల్ గెలిచింది ముంబై.
ఈ ఏడాది రంజీలో మరో సెమీఫైనల్ విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టుతో ఫైనల్‍లో తలపడనుంది ముంబై.