Bcci: రంజీ మ్యాచ్‌లు ఆడితే కాసుల వర్షమే- మ్యాచ్ ఫీజులు పెంచే యోచనలో బీసీసీఐ
Bcci: డొమెస్టిక్‌తోపాటు టెస్ట్ క్రికెట్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. డొమెస్టిక్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల ద్వారా ఏడాదికి కోటి వరకు ఆర్జించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
Bcci: రంజీ ట్రోఫీతో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ రూల్ విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన టీమిండియా క్రికెటర్స్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌లపై వేటు వేసింది. వారి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేసింది.
మ్యాచ్ ఫీజు పెంపు...
తాజాగా డొమెస్టిక్ క్రికెట్ ఆదరణను పెంచడానికి బీసీసీఐ మరో ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రంజీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచబోతున్నట్లు తెలిసింది. మ్యాచ్ ఫీజులను పెంచడం వల్ల స్టార్ ఆటగాళ్లు సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి ఆసక్తిని చూపే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతోన్న ప్లేయర్లకు ఏడాదికి మ్యాచ్ ఫీజుల ద్వారా ఇరవై ఐదు నుంచి ముఫ్పై లక్షల వరకు ఆర్జిస్తున్నారు. అయితే మొత్తాలను రెండింతలు పెంచే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
కోటి వరకు...
75 లక్షల నుంచి కోటి వరకు పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రపోజల్ అమలులోకి వస్తే రంజీ సీజన్ మొత్తం ఆడిన ఒక్కో ఆటగాడు మ్యాచ్ ఫీజుల ద్వారా కోటి వరకు సంపాదించే అవకాశం ఉంది. వచ్చే రంజీ సీజన్ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఐపీఎల్ మినహా...
టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో రాణిస్తోన్న పలువురు క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్‌కకు దూరంగా ఉంటున్నారు. ఐపీఎల్ ద్వారా కోట్లలో ఆర్జిస్తున్నారు. ఐపీఎల్ కోసం సన్నద్ధమయ్యేందుకు రంజీ, దులీప్, విజయ్ హజారే వంటి డొమెస్టిక్ సిరీస్‌లకు దూరంగా ఉంటున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆటగాళ్లలోని అసలైన ప్రతిభ బయటపడే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం.
టెస్ట్ ప్లేయర్లపై కూడా...
టీ20 ఫార్మెట్ మొదలైన తర్వాత టెస్టులకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. . టీ20లకు అలవాటుపడిన క్రికెటర్లు సుదీర్ఘ ఫార్మెట్‌లో సరిగా రాణించలేకపోతారు. ఎక్కవు సమయం పాటు క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. టెస్ట్‌లపై ఆటగాళ్లు ఆసక్తిని చూపేలా ఈ సుదీర్ఘ ఫార్మెట్ మ్యాచ్ ఫీజులను పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
ఓ ఏడాదిలో అన్ని టెస్టులు ఆడియన ప్లేయర్‌కు పదిహేను కోట్ల వరకు మ్యాచ్ ఫీజుల ద్వారా ఆదాయం దక్కేలా కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫీజులు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ క్రేజ్‌ను కాపాడటంతో పాటు ఈ ఫార్మెట్‌కు తగ్గట్టుగా యువ ఆటగాళ్లను సిద్ధం చేయడానికే ఈ రూల్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ద్రావిడ్, రోహిత్ సలహాలు...
డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌లలో మార్పులతో రాహుల్ ద్రావిడ్, అగార్కర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూచనలను బీసీసీఐ కోరినట్లు సమాచారం. వారి సలహాలతోనే ఈ మార్పులు చేయబోతున్నట్లు చెబుతోన్నారు.