Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో-shardul thakur hits his maiden first class century in ranji trophy semi final 2024 against tamil nadu cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో

Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 03, 2024 06:04 PM IST

Shardul Thakur - Ranji Trophy 2024: స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. సెమీస్ మ్యాచ్‍లో సెంచరీతో కదం తొక్కాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో శకతం చేసి ఆదుకున్నాడు.

Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో
Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో

Shardul Thakur: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొంతకాలంగా సరైన ఫామ్‍లో లేడు. దీంతో ఇంగ్లండ్‍తో స్వదేశంలో టెస్టు సిరీస్‍లోనూ అతడికి చోటు దక్కలేదు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నాడు శార్దూల్. రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్‍లో శార్దూల్ ఠాకూర్ విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) సెంచరీతో కదం తొక్కాడు.

ఈ రంజీ సెమీఫైనల్ మ్యాచ్‍లో 105 బంతుల్లోనే 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 109 రన్స్ చేశాడు శార్దూల్ ఠాకూర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కీలకమైన సెమీస్‍లో సెంచరీ చేసి శార్దూల్ దుమ్మురేపాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు..

ఈ సెమీఫైనల్ మ్యాచ్‍లో తమిళనాడు బౌలర్ల ధాటికి ముంబై జట్టు ఓ దశలో 106 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‍కు వచ్చిన శార్దూల్ ఠాకూర్.. ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో దుమ్మురేపాడు. మరో ఎండ్‍లో హెచ్‍జే తమోర్ (35), ఆ తర్వాత తనుష్ కోటియన్ (74 నాటౌట్) అతడికి సహకరించాడు. శార్దూల్ మాత్రం జోరుగానే బ్యాటింగ్ చేశాడు.

సిక్స్‌తో సెంచరీ

95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తమిళనాడు స్పిన్నర్ అజిత్ రామ్ బౌలింగ్‍లో లాంగాఫ్ మీదుగా సిక్స్ బాది సెంచరీకి చేరుకున్నాడు శార్దూల్. 90 బంతుల్లోనే శతకం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు.

దూకుడుగా సెలెబ్రేషన్స్

సెంచరీ చేశాక శార్దూల్ దూకుడుగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్, హెల్మెట్ కింద పెట్టి కమాన్ అంటూ అరిచాడు. డగౌట్‍లో ఉన్న ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే కూడా శార్దూల్ సెంచరీ చేయడంతో సెలెబ్రేట్ చేసుకున్నాడు.

109 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శార్దూల్ ఠాకూర్.. కుల్దీప్ సేన్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. తమోర్, కోటియన్‍తో రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ముంబై జట్టును శార్దూల్ ఆదుకున్నాడు. ఈ రంజీ సెమీస్ రెంజో రోజు ముగిసే సరికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 353 పరుగులు చేసింది. కోటియన్ (74 నాటౌట్), తుషార్ దేశ్ పాండే (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

ముంబై 207 పరుగుల భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు మొదటి రోజే 146 పరుగులకు ఆలౌటైంది.

విఫలమైన శ్రేయస్ అయ్యర్

ఇటీవల సరిగా రాణించలేకపోయిన భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‍తో సిరీస్‍లో మధ్యలోనే చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రంజీలో ఓ మ్యాచ్‍కు డుమ్మా కొట్టిన నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ అతడికి ప్లేస్ దక్కలేదు. ఈ తరుణంలో రంజీలో ముంబై తరఫున ఈ సెమీస్‍లో శ్రేయస్ బరిలోకి దిగాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో నేడు అతడు విఫలమయ్యాడు. తమిళనాడు పేసర్ సందీప్ వారియర్ బౌలింగ్‍లో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ బౌల్డ్ అయ్యాడు.

Whats_app_banner