తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ranji Trophy Record: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ టీమ్.. అత్యధిక లక్ష్యం ఛేదన

Ranji Trophy Record: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ టీమ్.. అత్యధిక లక్ష్యం ఛేదన

Hari Prasad S HT Telugu

19 February 2024, 14:26 IST

google News
    • Ranji Trophy Record: రంజీ ట్రోఫీలో సరికొత్త రికార్డు నమోదైంది. రైల్వేస్ టీమ్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.
రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ క్రికెట్ టీమ్
రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ క్రికెట్ టీమ్

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ క్రికెట్ టీమ్

Ranji Trophy Record: మన దేశంలో అతిపెద్ద దేశవాళీ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీలో రైల్వేస్ టీమ్ చరిత్ర సృష్టించింది. త్రిపురతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సోమవారం (ఫిబ్రవరి 19) అగర్తలలో జరిగిన ఈ మ్యాచ్ చివరి రోజు ఆ టీమ్ ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం విశేషం. ప్రథమ్ సింగ్, సైఫ్ సెంచరీలు చేయడంతో రైల్వేస్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి ఈ భారీ లక్ష్యాన్ని చేజ్ చేసింది.

రైల్వేస్ టీమ్ రంజీ రికార్డు

రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకూ 372 పరుగులతో సౌరాష్ట్ర పేరిట అత్యధిక పరుగుల ఛేదన రికార్డు ఉంది. ఇప్పుడా రికార్డును రైల్వేస్ టీమ్ తిరగరాసింది. నిజానికి త్రిపురతో మ్యాచ్ లో రైల్వేస్ పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో త్రిపురను 149 పరుగులకే కట్టడి చేసినా.. తర్వాత రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది.

దీంతో త్రిపుర జట్టుకు 44 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఆ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 333 రన్స్ చేసింది. దీంతో మొత్తంగా వాళ్ల లీడ్ 377 రన్స్ కు చేరింది. రైల్వేస్ ముందు 378 లక్ష్యం ఉండటంతో ఇది అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ మూడో రోజు లంచ్ తర్వాత కాసేపటికి ఈ టార్గెట్ చేజ్ చేయడం మొదలు పెట్టిన రైల్వేస్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

రైల్వేస్ హీరోలు.. మహ్మద్ సైఫ్, ప్రథమ్ సింగ్

చేజింగ్ లోనూ రైల్వేస్ ఆరంభం దారుణంగా ఉంది. ఆ టీమ్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో ఓపెనర్ ప్రథమ్ సింగ్.. మహ్మద్ సైఫ్ (106)తో కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 175 పరుగులు జోడించాడు. దీంతో ఆ టీమ్ మళ్లీ గాడిలో పడింది. సైఫ్ ఔటైనా..కెప్టెన్ ఉపేంద్ర యాదవ్ (27 నాటౌట్)తో కలిసి ప్రథమ్ సింగ్ మ్యాచ్ ముగించాడు.

చివరికి 169 పరుగులతో ప్రథమ్ అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 103 ఓవర్లలో రైల్వేస్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. అయితే రికార్డు చేజ్ తో చరిత్ర సృష్టించినా రైల్వేస్ మాత్రం నాకౌట్ స్టేజ్ కు చేరుకోలేకపోయింది. ఆ టీమ్ ఎలైట్ గ్రూప్ సిలో 24 పాయింట్లతో ఉంది. మరోవైపు ఓడినా కూడా 17 పాయింట్లతో త్రిపుర టీమ్ ఎలైట్ గ్రూప్ లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది.

రంజీ ట్రోఫీలో అత్యధిక ఛేదనలు

రైల్వేస్ 378/5 (త్రిపురపై) - 2023-24

సౌరాష్ట్ర 372/4 (ఉత్తర ప్రదేశ్ పై) - 2019-20

అస్సాం 371/4 (సర్వీసెస్ పై) - 2008-09

రాజస్థాన్ 360/4 (విదర్భపై) - 1989-90

ఉత్తర ప్రదేశ్ 359/4 (మహారాష్ట్రపై) - 2021-22

తదుపరి వ్యాసం