County Cricket: 501 పరుగుల టార్గెట్ చేజ్ చేసేశారు.. అర్ష్‌దీప్ ఆడిన తొలి కౌంటీ మ్యాచ్ ఇదే
County Cricket: 501 పరుగుల టార్గెట్ చేజ్ చేసేశారు. కౌంటీ క్రికెట్ లో సరికొత్త రికార్డు నమోదైంది. అయితే టీమిండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ ఆడిన తొలి కౌంటీ మ్యాచ్ ఇదే కావడం మరో విశేషం.
County Cricket: కౌంటీ క్రికెట్ లో సరికొత్త రికార్డు నమోదైంది. ఏకంగా 501 పరుగుల టార్గెట్ ను చేజ్ చేసింది సర్రే టీమ్. కెంట్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సర్రే రికార్డు క్రియేట్ చేసింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ లో నమోదైన రెండో అత్యధిక చేజ్ ఇది. 1925 తర్వాత అయితే ఇదే అత్యధిక చేజింగ్. ఇక ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చేజ్ చేసిన 9వ అత్యధిక స్కోరు.
ఈ మ్యాచ్ తోనే కెంట్ తరఫున టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కౌంటీ క్రికెట్ అరంగేట్రం చేయడం గమనార్హం. అయితే అతడు ఆడిన తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థి టీమ్ ఇంత భారీ టార్గెట్ చేజ్ చేసింది. అర్ష్‌దీప్ రెండు ఇన్నింగ్స్ లోనూ రెండేసి వికెట్లు తీసుకున్నాడు. సర్రే బ్యాటర్లు డామ్ సిబ్లీ (140), బెన్ ఫోక్స్ (124), జేమీ స్మిత్ (114) సెంచరీలు చేయడంతో ఈ భారీ లక్ష్యాన్ని సర్రే చేజ్ చేయగలిగింది.
బుధవారం (జూన్ 14) ముగిసిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సర్రే విజయం సాధించింది. నిజానికి ఈ మ్యాచ్ లో సర్రే పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో కెంట్ 301 పరుగులు చేసింది. కానీ సర్రే మాత్రం కేవలం 145 పరుగులకు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కెంట్ టీమ్ 344 పరుగులు చేసి సర్రే ముందు 501 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆ టీమ్ ఆటతీరు చూసిన వాళ్లు ఎవరూ ఇంత భారీ టార్గెట్ చేజ్ చేస్తుందని ఊహించలేదు. చివరి రోజు విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. దాదాపు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సర్రే ఛేదించింది. చివరి రెండు రోజుల్లోనే ఇంత భారీ టార్గెట్ చేజ్ చేయాల్సి రావడంతో సర్రే వేగంగా ఆడాల్సి వచ్చింది. స్మిత్ వేగంగా ఆడి సెంచరీ చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత సిబ్లీ, ఫోక్స్ ఓపిగ్గా ఆడుతూ సర్రే టీమ్ ను గట్టెక్కించారు. ఈ విజయంలో సర్రే టీమ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ టేబుల్లో ఐదో స్థానానికి దూసుకెళ్లగా.. కెంట్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇది చాలా కష్టమైన టార్గెట్ అయినా సరే తాము వెనక్కి తగ్గలేదని, ప్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడారని సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్ అన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్