Ramiz Raja on Pakistan: ఇండియా దెబ్బకు పాకిస్థాన్ కోలుకోలేకపోయింది.. భయపడిపోయారు: రమీజ్ రాజా
15 September 2023, 13:23 IST
- Ramiz Raja on Pakistan: ఇండియా దెబ్బకు పాకిస్థాన్ కోలుకోలేకపోయిందని అన్నాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. ఆ ప్రభావమే శ్రీలంకతో మ్యాచ్ లోనూ కనిపించిందని చెప్పాడు.
శ్రీలంక చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్
Ramiz Raja on Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఏస్థాయిలో ఇండియా దెబ్బ కొట్టిందో మనం చూశాం. వన్డేల్లో ఆ జట్టుపై రికార్డు విజయంతో దాయాది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆ దెబ్బ నుంచి కోలుకోకపోవడం వల్లే శ్రీలంకతోనూ పాకిస్థాన్ ఓడిపోయిందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అన్నాడు. శ్రీలంక చేతుల్లో ఓడిపోయిన పాక్.. ఆసియా కప్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
మానసికంగా ఆ ఓటమి పాకిస్థాన్ జట్టును దారుణంగా దెబ్బ తీసిందని రమీజ్ అభిప్రాయపడ్డాడు. "ఇండియా చేతుల్లో భారీ ఓటమి పాకిస్థాన్ ను మానసికంగా దారుణంగా దెబ్బ తీసింది. శ్రీలంకతో మ్యాచ్ లోనూ దాని ప్రభావం కనిపించింది. వాళ్లు చాలా భయం భయంగా పిరికిగా కనిపించారు. బాబర్ ఆజం, టాపార్డర్ అతి జాగ్రత్తకు పోయారు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించలేకపోయారు" అని రమీజ్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.
బాబర్ ఆజం కెప్టెన్సీతోపాటు అసలు ఫామ్ లో లేని ఫఖర్ జమాన్ ను ఎంపిక చేయడాన్ని కూడా రమీజ్ ప్రశ్నించాడు. "ఫఖర్ జమాన్ ఇలా వచ్చి అలా ఔటవుతున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ షాక్ కు గురి చేసింది. ఫఖర్ ఆడటం ఇష్టం లేనట్లు కనిపించాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్ తప్ప స్లో పిచ్ పై బాబర్ ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్ గానూ అతడు దూకుడు పెంచాలి. అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి" అని రమీజ్ చెప్పాడు.
గాయాలు, జ్వరాలంటూ మ్యాచ్ లకు దూరమైన ఇమాముల్ హక్, సాద్ షకీల్ లపై మండిపడ్డాడు. జ్వరంలోనూ 1992 వరల్డ్ కప్ లో ఇంజిమాముల్ హక్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ గురించి రమీజ్ గుర్తు చేశాడు. "ఆ రోజు ఉదయాన్నే ఇంజీ సెమీఫైనల్ ఆడటానికి నిరాకరించాడు. అతడు నిద్రపోలేదు. అతని పొట్టలో ఏదో సమస్య వచ్చింది. కానీ అతన్ని బలవంతంగా ఆడించారు. మరో ఆప్షన్ లేదన్నారు. అతడు కూడా బరిలోకి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గొప్ప ప్లేయర్స్ కావాలంటే ఫిట్ గా లేని ప్లేయర్స్ కాస్త రిస్క్ తీసుకోవాలి" అని రమీజ్ అన్నాడు.
టాపిక్