Rahul Dravid Award: రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు.. కోహ్లి, రోహిత్‌లకూ అవార్డులు
21 August 2024, 22:17 IST
Rahul Dravid Award: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ సియెట్ క్రికెట్ అవార్డుల్లో భాగంగా లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. అటు టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు కూడా ఇందులో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. బుధవారం (ఆగస్ట్ 21) ఈ కార్యక్రమం జరిగింది.
రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు.. కోహ్లి, రోహిత్‌లకూ అవార్డులు
Rahul Dravid Award: టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్.. సియెట్ క్రికెట్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. బుధవారం (ఆగస్ట్ 21) ఈ సెర్మనీ జరగగా.. ద్రవిడ్ కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇండియన్ క్రికెట్ కు అతడు అందించిన సేవలకుగాను ఈ అవార్డు అందించారు.
రాహుల్ ద్రవిడ్ అఛీవ్‌మెంట్స్
రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ గానే కాదు అంతకుముందు ప్లేయర్ గానూ ఇండియన్ క్రికెట్ కు ఎనలేని సేవలు అందించాడు. ఓ ప్లేయర్ గా వరల్డ్ కప్ అందుకోవాలన్న కల నెరవేరకపోయినా.. కోచ్ గా టీ20 వరల్డ్ కప్ రూపంలో అది నెరవేర్చుకున్నాడు. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఇండియా తరఫున అతడు 164 టెస్టులు, 244 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.
మొత్తంగా టెస్టుల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13288 రన్స్.. వన్డేల్లో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 10889 రన్స్ చేశాడు. ఐపీఎల్లో మెంటార్ గా.. అండర్ 19 టీమ్ కోచ్ గా కూడా ద్రవిడ్ సేవలు అందించాడు. 2018లో అండర్ 19 టీమ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కోచ్ అతడే. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడెమీ హెడ్ గా ఉన్న ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్ గా పని చేసి తప్పుకున్నాడు.
విరాట్, రోహిత్, షమిలకూ అవార్డులు
విరాట్ కోహ్లికి ఈ సియెట్ క్రికెట్ అవార్డుల్లో బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అతడు 2023లో వన్డేల్లో 1377 రన్స్ చేశాడు. అందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ లో 765 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాదు గతేడాదే వన్డేల్లో 50వ సెంచరీతో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
అటు కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అతడు 2023లో అన్ని ఫార్మాట్లు కలిపి 1800 రన్స్ చేశాడు. అందులో వన్డేల్లో 1255 రన్స్ ఉన్నాయి. ఇక మహ్మద్ షమి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. గతేడాది వరల్డ్ కప్ లో షమి 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ అవార్డుల్లోనే యశస్వి జైస్వాల్ కు బెస్ట్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, శ్రేయస్ అయ్యర్ కు స్టార్ స్పోర్ట్స్ టీ20 లీడర్షిప్ అవార్డు, అశ్విన్ కు బెస్ట్ టెస్ట్ బౌలర్ అవార్డు, దీప్తి శర్మకు వుమెన్స్ ఇండియన్ బౌలర్ ఆఫ్ ఇయర్ అవార్డు దక్కాయి.