Rahul Dravid: ఐసీసీ టోర్నీల కంటే ఆ ఓటమే ఎక్కువ బాధపెట్టింది.. రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ వైరల్
Rahul Dravid Lowest Point As Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు తనను ఎక్కువగా బాధపెట్టిన ఓటమి గురించి తాజాగా చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రవిడ్. వన్డే వరల్డ్ కప్ 2024, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ వంటి ఐసీసీ టోర్నీల కంటే ఆ ఓటమే బాధించిందని తెలిపాడు.
Rahul Dravid Lowest Point As Team India Head Coach: రాహుల్ ద్రవిడ్ పురుషుల క్రికెట్ జట్టుకుప్రధాన కోచ్‌గా ఉన్న కాలంలో భారత్‌ను మూడు ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో ద్రవిడ్ తన ప్రస్థానాన్ని విజయపథంతో ముగించాడు.
కానీ, దానికంటే ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియాపై భారత్ వరుసగా పరాజయాల పాలైన విషయం తెలిసిందే. అయితే, తన విజయవంతమైన పదవీకాలంలో ద్రవిడ్ కొన్ని చేదు అనుభవాలను చూశాడు. హెడ్ కోచ్‌గా కెరీర్‌లో దారుణమైన ఓటమిలను ఎక్స్‌పీరియన్స్ చేశాడు ద్రవిడ్.
అయితే, తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్‌గా తనను ఏ ఓటమి ఎక్కువగా బాధపెట్టిందో చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రవిడ్. "టీమిండియా హెడ్ కోచ్‌గా నా ప్రయాణంలో లోయెస్ట్ పాయింట్ ఏంటని అడిగితే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ పరాజయం అని చెబుతాను. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలోనే ఆ ఓటమి ఎదురైంది" అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
"ఈ సిరీస్‌లో సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌ను మేము గెలిచాం. రెండో, మూడో టెస్ట్‌లో కూడా అద్భుత ప్రదర్శన చూపాం. అయితే, సునాయసంగా సిరీస్ గెలుస్తామని అనుకున్నాం. సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఇండియా ఏ సిరీస్ గెలవలేదు. ఇది గెలిచేందుకు మాకు గొప్ప అవకాశం లభించింది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఆ సిరీస్ ఆడాం" అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
"గాయం కారణంగా రోహిత్ శర్మ ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. అతనితోపాటు మరికొంతమంది సీనియర్ ప్లేయర్స్ సేవలను మేము కోల్పోయాం. కానీ, ఈ సిరీస్‌లో మేము గట్టి పోటీ ఇచ్చాం. సెకండ్, థర్డ్ టెస్ట్ ఓడినప్పటికీ మేము అద్భుతంగా పోరాడం. మేము మంచి టార్గెట్ నమోదు చేసి గెలవాల్సింది. కానీ, సౌతాఫ్రికా అద్భుతంగా ఆడింది. నాలుగో ఇన్నింగ్స్‌లో మా లక్ష్యాన్ని ఈజీగా చేధించింది" అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు.
"ఈ సిరీస్ పరాజయమే టీమిండియా హెడ్ కోచ్‌గా నన్ను బాధపెట్టిన అంశం. ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా సిరీస్‌ను చేజార్చుకోవడం ఇప్పటికీ వెంటాడుతోంది. కానీ, ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మా టీమ్‌కు కావాల్సింది ఏంటో తెలుసుకున్నాం. మిగతా జట్లు కూడా విజయం కోసమే ఆడుతాయి. వరల్డ్ క్లాస్ జట్లతో ఆడుతున్నప్పుడు ప్రతిసారి గెలవడం కుదరదు" అని ద్రవిడ్ వెల్లడించారు.
"గెలుపుకు కావాల్సిన సన్నద్ధత ఉండాలి. సరైన జట్టు కాంబినేషన్‌తోపాటు విజయానికి కావాల్సిన స్ట్రాటజీస్ వేసుకోవాలి. పరిస్థితులను అంచనా వేసి దానికి తగినట్లుగా బ్యాటింగ్, బౌలింగ్ చేయాలి. ఇలా చేసిన కూడా కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు దక్కవు. ఈ ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకుని మరింత బలంగా మారేందుకు ప్రయత్నించాలి" అని రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.