Ganguly Warns Pakistan: ఇండియాతో అహ్మదాబాద్‌లో మ్యాచ్ అంటే మాటలు కాదు: పాకిస్థాన్‌కు గంగూలీ వార్నింగ్
01 September 2023, 14:04 IST
- Ganguly Warns Pakistan: ఇండియాతో అహ్మదాబాద్‌లో మ్యాచ్ అంటే మాటలు కాదంటూ పాకిస్థాన్‌కు గంగూలీ వార్నింగ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.
సౌరవ్ గంగూలీ
Ganguly Warns Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ రెండు నెలలు పండగే. ఈ దాయాదులు రెండు నెలల వ్యవధిలోనే కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. ఇందులో శనివారం (సెప్టెంబర్ 2) తొలి మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఆ వార్నింగ్ ఆసియా కప్ మ్యాచ్ గురించి కాదు. వచ్చే నెలలో వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరనున్న మ్యాచ్ గురించి కావడం విశేషం. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఆ స్టేడియంలో లక్షా 10 వేల మంది ప్రేక్షకుల ముందు ఈ మ్యాచ్ ఆడటం పాకిస్థాన్ కు అంత ఈజీ కాదని గంగూలీ అనడం విశేషం.
"ఇది చాలా పెద్ద మ్యాచ్. గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఇది పెద్ద మ్యాచే. వరల్డ్ కప్ లో ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్. పాకిస్థాన్ తో మ్యాచ్ ను నేను ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా సౌతాఫ్రికా మ్యాచ్ లాగే చూసేవాడిని. ఆ ఒత్తిడిని ఫీలైతే మన ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
ఇది మరో మ్యాచ్ అంతే కదా అనడానికి లేదు. అలాగే ఈ మ్యాచ్ కు సిద్ధం కావాలి. అలాగే ఒత్తిడిని అధిగమించగలరు. కొందరు ఆ ఒత్తిడిని భరించగలరు. మరికొందరు భరించలేరు. నేను ఆడే సమయంలో పాకిస్థాన్ పై మంచి రికార్డు మనకు ఉంది. అయితే గతేడాది దుబాయ్ లో ఇండియాను పాకిస్థాన్ ఓడించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
పాకిస్థాన్ చాలా మంచి టీమ్. వాళ్లు మంచి మంచి ప్లేయర్స్ ను తయారు చేస్తున్నారు. అయితే ఇండియాలో ఇండియాతో ఆడటం, ఇండియాతో అహ్మదాబాద్ లో ఆడటం, ఇండియాతో లక్షా 10 వేల మంది ముందు ఆడటం పూర్తిగా భిన్నమైనది" అని గంగూలీ అన్నాడు.
ఇక ఇండియా అన్ని ఫైనల్స్ గెలవలేదు అంటూ గతంలో తాను చేసిన కామెంట్స్ పై కూడా గంగూలీ స్పష్టత ఇచ్చాడు. "ఇండియా అన్ని ఫైనల్స్ గెలవలేదు. కానీ ఫైనల్ చేరాలంటే బాగా ఆడాలి. 9 మ్యాచ్ లలో మెజార్టీ మ్యాచ్ లు గెలవాలి. టోర్నీ మొదట్లోనే ఫైనల్ గురించి ఆలోచించకూడదు.
ఇది కూడా బ్యాటింగ్ చేయడం లాంటిదే. బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడే సెంచరీ గురించి ఆలోచించకూడదు. ముందు 50, 60, 70 చేస్తూ 90ల్లోకి వెళ్లిన తర్వాత 100 గురించి ఆలోచించాలి. వరల్డ్ కప్ విషయంలోనూ అదే జరుగుతుంది. ముందు బాగా ఆడిన ఫైనల్ చేరాలి. ఒకసారి ఫైనల్ చేరిన తర్వాత అది గెలవడానికి ప్రయత్నించాలి" అని గంగూలీ చెప్పాడు.