Team India: ప్రపంచకప్‍కు టీమిండియా ఇలా ఉండాలి: తన జట్టును ప్రకటించిన గంగూలీ.. ఆ ముగ్గురికి నో ప్లేస్
Team India: వన్డే ప్రపంచకప్‍నకు భారత జట్టు ఎలా ఉండాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. 15 మంది భారత ఆటగాళ్లతో తన టీమ్‍ను ప్రకటించారు.
Team India: ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‍పై క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా ఉంది. భారత్ వేదికగా ఈ ఏడాది టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా ప్రధానమైన ఫేవరెట్‍గా ఉంది. మెగాటోర్నీకి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ,సెలెక్టర్లు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఏ ఆటగాళ్లను తీసుకోవాలో కొందరు మాజీలు కూడా సూచనలు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తాజాగా ప్రపంచకప్ కోసం తన భారత జట్టును ప్రకటించారు. మెగాటోర్నీ కోసం టీమిండియాలో ఏ ఆటగాళ్లను తీసుకోవాలో సూచించారు. ఆ వివరాలివే..
15 మంది ఆటగాళ్లతో కూడిన తన భారత జట్టును ప్రపంచకప్ టోర్నీ కోసం ప్రకటించారు సౌరవ్ గంగూలీ. ఆయన జట్టును ఎంపిక చేసుకున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, తిలక్ వర్మకు తన జట్టులో చోటువ్వలేదు దాదా. అలాగే, స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍కు కూడా ప్లేస్ ఇవ్వలేదు. ఒకవేళ ఏ బ్యాటర్ అయినా గాయపడితే తిలక్‍ను తీసుకోవచ్చని, చాహల్ బ్యాకప్ స్పిన్నర్‌గా ఎంపిక చేసుకుంటానని గంగూలీ చెప్పారు. ఏ బౌలరైనా ఫిట్‍గా లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంటానని చెప్పారు. తన జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకే ఓటేశారు సౌరవ్ గంగూలీ.
2023 వన్డే ప్రపంచకప్ కోసం సౌరవ్ గంగూలీ ఎంపిక చేసుకున్న భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
టీమిండియా తదుపరి ఆసియాకప్ ఆడనుంది. ఆగస్టు 30న ఈ టోర్నీ మొదలుకానుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‍తో జరిగే మ్యాచ్‍తో ఆసియాకప్ పోరును భారత జట్టు మొదలుపెట్టనుంది. ఆ తర్వాత ప్రపంచకప్‍పై పూర్తి దృష్టి సారించనుంది. వన్డే ప్రపంచకప్‍కు భారత జట్టును సెప్టెంబర్‌లోనే బీసీసీఐ ప్రకటించనుంది. ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.