Asia Cup Free Streaming: ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఫ్రీగా చూసేయొచ్చు.. ఏం చేయాలంటే?
Asia Cup Free Streaming: ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఫ్రీగా చూసేయొచ్చు. క్రికెట్, అందులోనూ మెగా టోర్నీలు.. అలాంటి మ్యాచ్ లను కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా చూపిస్తుండటం విశేషం.
Asia Cup Free Streaming: ఆసియా కప్, వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఇప్పుడీ రెండు టోర్నమెంట్లలోని మ్యాచ్ లన్నింటినీ ఫ్రీగా చూసే అవకాశం ఉంది. కొన్నాళ్ల కిందట ఐపీఎల్ మ్యాచ్ లను జియో సినిమా ఫ్రీగా ఎలా అందించిందో చూశాం కదా.
ఇప్పుడు హాట్‌స్టార్ కూడా అదే రూట్లో వెళ్తోంది. అయితే ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచ్‌లను కేవలం మొబైల్ యాప్ లో మాత్రమే ఫ్రీగా చూసే వీలు కల్పించింది. కంప్యూటర్, టీవీ స్క్రీన్లపై చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. ఈ లెక్కన మీరు కేవలం మీ మొబైల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.
మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకొని ఈ మ్యాచ్ లను ఫ్రీగా చూసేయొచ్చు. ఈ విషయాన్ని ఈ మధ్య ఓ ఫన్నీ యాడ్ ద్వారా హాట్‌స్టార్ వెల్లడించింది. ఓ సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ కు అతని ఫ్రెండ్ ఫోన్ చేసి విసిగిస్తుంటాడు. ఆసియా కప్ మ్యాచ్ వస్తోంది.. నీ హాట్‌స్టార్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ చెప్పమని అడుగుతాడు.
ఇప్పుడు మ్యాచ్ లన్నీ ఫ్రీగా చూసేయొచ్చని సదరు డాక్టర్ ఫ్రెండ్ చెప్పినా అవతలి వ్యక్తి నమ్మడు. అది కేవలం ఐదు నిమిషాలే కదా అంటాడు. తన సర్జరీకి ఆలస్యం అవుతుండటంతో ఇక సహనం నశించిన పేషెంట్ కూడా మ్యాచ్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు అంటూ ఆ డాక్టర్ ఫ్రెండ్ కు చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచ్ లన్నింటినీ ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఫ్రీగా చూసేయండని హాట్‌స్టార్ చెప్పింది.
నిజంగా ఇది క్రికెట్ లవర్స్ కు బంపర్ ఆఫర్ అని చెప్పాలి. కేవలం మొబైల్ కే పరిమితం చేసినా.. ఈ కాలంలో కంప్యూటర్, టీవీ స్క్రీన్ల కంటే మొబైల్సే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఈసారి ఈ రెండు టోర్నీల వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేకవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్రీ యూజర్లను తర్వాత తమ సబ్‌స్క్రైబర్లుగా మార్చుకోవడంతోపాటు భారీ వ్యూయర్‌షిప్ ద్వారా యాడ్ రెవెన్యూ పెంచుకునే ఆలోచనలో భాగంగానే హాట్‌స్టార్ ఇలా ఫ్రీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.