Shoaib Akhtar: ఆ టీమిండియా బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి భయపడేవాడిని: పాకిస్థాన్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్
06 March 2024, 10:53 IST
- Shoaib Akhtar: పాకిస్థాన్‌లోనే కాదు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ గా షోయబ్ అక్తర్ కు పేరుంది. అలాంటి బౌలర్ కూడా ఓ టీమిండియా బ్యాటర్ ను చూసి భయపడేవాడట. అయితే అది అందరూ అనుకుంటున్నట్లు సచిన్, సెహ్వాగ్ కాదు.
ఓ టీమిండియా బ్యాటర్ కు బౌలింగ్ చేయడానికి భయపడేవాడినని షోయబ్ అక్తర్ చెప్పాడు
Shoaib Akhtar: పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ గురించి తెలియని వాళ్లు ఎవరుంటారు? తాను ఆడే రోజుల్లోనే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ అతడు. అలాంటి బౌలర్ ను ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లు కూడా భయపడేవాళ్లు. కానీ అలాంటి బౌలర్ కూడా ఓ టీమిండియా బ్యాటర్ ను చూసి భయపడేవాడట. ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా ఈ విషయం చెప్పాడు.
బాలాజీ అంటే భయం: అక్తర్
అక్తర్ ఓ టీమిండియా బ్యాటర్ కు భయపడేవాడు అంటే అందరూ సచినో, సెహ్వాగో, ద్రవిడో అని అనుకోవడం సహజం. కానీ అక్తర్ మాత్రం వీళ్లెవరి పేర్లూ చెప్పలేదు. నిజానికి అంతటి సెహ్వాగ్ కూడా అక్తర్ బౌలింగ్ ఆడాలంటే భయపడేవాడినని ఓ సందర్భంలో అన్నాడు. అతని బౌలింగ్ లో బాల్ ఎక్కడ తగులుతుందో అన్న భయం ఉండేదని చెప్పాడు.
మరి అలాంటి అక్తర్ కూడా టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటర్ లక్ష్మీపతి బాలాజీని చూసి భయపడేవాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అక్తరే వెల్లడించాడు. అతడు తన బౌలింగ్ ను సులువగా ఆడేవాడని, తాను మాత్రం అతన్ని ఔట్ చేయలేకపోయేవాడినని చెప్పాడు. నిజానికి బాలాజీ టీమిండియా పేస్ బౌలర్. ఇండియా తరఫున 2002 నుంచి 2012 మధ్య 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టీ20లు ఆడాడు.
"నేను ఎదుర్కొన్న కఠినమైన ప్రత్యర్థి, నేను చాలా భయపడిన వ్యక్తి లక్ష్మీపతి బాలాజీ. చివర్లో అతడు నా బౌలింగ్ లో బాదేవాడు. కానీ నేను మాత్రం అతన్ని ఔట్ చేయలేకపోయే వాడిని" అని అక్తర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే వేగవంతమైన బాల్ వేసిన ఫాస్ట్ బౌలర్ గా పేరుగాంచాడు. అతడు గంటకు 100 మైళ్ల వేగంతోనూ బౌలింగ్ చేశాడు.
పాకిస్థాన్ తరఫున అక్తర్ 1997 నుంచి 2011 మధ్య 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇక షోయబ్ అక్తర్ ఈ మధ్యే మరోసారి తండ్రి అయ్యాడు. అతడికి కూతురు పుట్టగా ఆమెకు నూరె అలీ అక్తర్ అనే పేరు పెట్టాడు. సోషల్ మీడియా ద్వారా అక్తర్ తనకు కూతురు పుట్టిన విషయాన్ని వెల్లడించాడు. అతనికి ఇప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఆ సిరీస్‌లో బాలాజీ హవా
2004లో పాకిస్థాన్ పర్యటనకు టీమిండియా వెళ్లింది. అప్పట్లో సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ పర్యటనలో ఇండియా టెస్ట్, వన్డే సిరీస్ విజయాలు సాధించింది. అందులో బాలాజీ చివర్లో వచ్చి 45 రన్స్ చేశాడు. అందులో 36 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. అంతేకాదు అతడు ఆరు వికెట్లు కూడా తీసుకున్నాడు.
టాపిక్