Laxman - Dravid: 23 ఏళ్ల క్రితం ఇదే రోజు చరిత్రను తిరగరాసిన లక్ష్మణ్, ద్రావిడ్
14 March 2024, 11:50 IST
Laxman - Dravid: 23 ఏళ్ల క్రితం లక్ష్మణ్, ద్రావిడ్ అసమాన బ్యాటింగ్‌తో టెస్టుల్లో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నది టీమిండియా. లక్ష్మణ్ ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్‌లో గొప్ప పోరాటంగా మిగిలిపోయింది.
రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్
Laxman - Dravid: సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం ఇదే రోజు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఖాయమనుకున్న తరుణంలో భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అద్భుతమే చేశారు. అసాధారణ పోరాటంతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. వీరిద్దరు కలిసి 376 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించి టీమిండియాకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టారు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ డబుల్ సెంచరీ చేయగా (281 రన్స్) ద్రావిడ్ 180 పరుగులు చేశాడు.
ఈడెన్ గార్డెన్ వేదికగా...
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. స్టీవ్ వా సెంచరీ (110 రన్స్) హెడెన్ (97) పరుగులతో రాణించారు. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు వికెట్లు తీసుకున్నాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 171 పరుగులకే ఆలౌటైంది. లక్ష్మణ్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. ఫాలో ఆన్‌లో పడిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 115 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సచిన్, గంగూళీ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
376 పరుగుల భాగస్వామ్యం...
ద్రావిడ్‌తో కలిసి లక్ష్మణ్ ఆస్ట్రేలియా బౌలర్ల భరతం పట్టాడు. పట్టుదలగా క్రీజులో నిలదొక్కుకున్న ఈ జోడీ ఐదో వికెట్‌కే ఏకంగా 376 పరుగులు జోడించారు. వీరిద్దరిని విడదీయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. లక్ష్మణ్ 44 ఫోర్లతో 281 పరుగులు చేశాడు. ట్రిపుల్ సెంచరీకి చేరువైన అతడిని మెగ్‌గ్రాత్ ఔట్ చేశాడు.
ద్రావిడ్ కూడా స్ఫూర్తిదాయక పోరాటాన్ని కొనసాగించాడు. 20 ఫోర్లతో 180 రన్స్ చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ మెరుపులతో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ 657 పరుగులకు డిక్లేర్ చేసింది. హర్భజన్, సచిన్ దెబ్బకు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. 171 పరుగుల తేడాతో ఇండియా చేతిలో ఓటమి పాలైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఆరు, సచిన్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఈటెస్ట్‌లో హర్భజన్ మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు.
గ్రేట్ ఇన్నింగ్స్...
లక్ష్మణ్, ద్రావిడ్ పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో గ్రేట్ ఇన్నింగ్స్‌లుగా నిలిచాయి. ఆస్ట్రేలియాపై చేసిన 281 పరుగులు టెస్టుల్లో లక్ష్మణ్‌కు హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ హీరోగా మారిపోయాడు. లక్ష్మణ్ పోరాటంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్నది. ఈ సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా...రెండు, మూడో టెస్ట్‌లలో టీమిండియా గెలిచింది.
హెడ్ కోచ్...
ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడెమీకి హెడ్‌గా లక్ష్మణ్ ఉన్నాడు. అండర్ 19 టీమ్‌కు లక్ష్మణ్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవలే హెడ్ కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం ముగియగా బీసీసీఐ పొడగించింది. తొలుత ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ కోచ్‌గా నియమితుడు కానున్నట్లు వార్తలొచ్చాయి.