IND vs NZ Live score: టీమిండియా స్పిన్నర్ల ప్లాన్‌ని కనిపెట్టేసిన న్యూజిలాండ్, ఈరోజు భారత్‌పై ప్రయోగించే ప్రమాదం?
25 October 2024, 7:16 IST
India vs New Zealand 2nd Test: పుణె టెస్టులో సరికొత్త వ్యూహాన్ని భారత్ తెరపైకి తెచ్చింది. దెబ్బకి ఒకానొక దశలో 197/3తో ఉన్న న్యూజిలాండ్ టీమ్ 259 పరుగులకే కుప్పకూలిపోయింది.
పుణె టెస్టు
న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ జట్టు స్పిన్నర్లు సరికొత్త వ్యూహంతో ఆ జట్టుని తొలిరోజే కుప్పకూల్చారు. ఒకానొక దశలో 197/3తో పటిష్ట స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను 259 పరుగులకే కుప్పకూల్చడం వెనుక ఉన్న ప్లాన్ ఉంది. దాన్ని గురువారం సాయంత్రానికే న్యూజిలాండ్ కూడా కనిపెట్టేసింది.
సుందర్ ప్లాన్ ఏంటంటే?
మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం భారత్ జట్టు 16/1తో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించబోతోంది. ఒకవేళ టీమిండియా స్పిన్నర్ల ప్లాన్‌నే న్యూజిలాండ్ స్పిన్నర్లూ అనుసరిస్తే.. భారత్ బ్యాటర్లకీ ఇబ్బందులు తప్పవు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే? తొలుత వేగంగా ఒకే ప్రదేశంలో బంతులు విసిరి.. ఆ తర్వాత సడన్‌గా బంతి వేగాన్ని సుందర్, అశ్విన్ తగ్గించారు.
అలా వేగం తగ్గించడం వల్ల పుణె పిచ్ నుంచి అనూహ్యమైన టర్న్ లభించండతో పాటు బ్యాటర్ ఊహించలేని విధంగా బౌన్స్ మొదలైంది. ఈ క్రమంలో కొన్ని బంతులు న్యూజిలాండ్ బ్యాటర్ పక్క నుంచి వెళ్లి వికెట్లని గీరాటేశాయి. మరికొన్ని ఎడ్జ్ తీసుకున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు న్యూజిలాండ్ బ్యాటర్లని సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాచ్‌లో గురువారం న్యూజిలాండ్ టాప్-3 వికెట్లని రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టగా.. ఆ తర్వాత ఏడు వికెట్లనీ వాషింగ్టన్ సుందర్ ఈ వేగం మార్చే వ్యూహంతోనే పడగొట్టాడు. దాంతో భారత్ స్పిన్నర్లు అనుసరించిన వ్యూహాన్నే మేమూ అనుసరిస్తామని న్యూజిలాండ్ టీమ్ అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచి గురువారం రాత్రి ప్రకటించాడు.
కివీస్ అదే వ్యూహం
తొలి రోజు ఆట అనంతరం రోంచి విలేకరులతో మాట్లాడుతూ ‘‘తొలి సెషన్‌లో భారత స్పిన్నర్లు చాలా వేగంగా బౌలింగ్ చేశారు. కానీ రెండో సెషన్ ఆఖరికి వచ్చే సరికి వేగాన్ని సడన్‌గా తగ్గించేశారు. అలా చేయడం వల్ల పిచ్ నుంచి టర్న్, బౌన్స్ రూపంలో భిన్నమైన రియాక్షన్స్ కనిపించాయి. ఈ పుణె పిచ్‌పై వేగంలో మార్పు చాలా ముఖ్యమని మాకు అర్థమైంది. కాబట్టి మేము శుక్రవారం అదే తరహాలో బౌలింగ్ చేస్తాం’’ అని రోంచి చెప్పుకొచ్చాడు.
సుందర్ రీఎంట్రీ.. మ్యాజిక్
2021లో చివరిగా భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడిన వాషింగ్టన్ సుందర్ పుణె టెస్టు ముంగిట భారత్ జట్టులోకి వచ్చాడు. అప్పటికే టీమ్‌లోనే ఉన్న కుల్దీప్ యాదవ్, రిజర్వ్ బెంచ్‌పై ఉన్న అక్షర్ పటేల్‌ను వద్దనుకుని మరీ సుందర్‌కి తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చోటివ్వగా.. అవకాశాన్ని రెండుజేతులా వినియోగించుకున్న సుందర్ 7 వికెట్లతో కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు.
సుందర్ అనుసరించిన వ్యూహానికి న్యూజిలాండ్ బ్యాటర్ వద్ద సమాధానమే లేకపోయింది. అతను మొత్తం 7 వికెట్లని తొలి ఇన్నింగ్స్‌లో పడగొట్టగా.. ఐదుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారంటే ఎంతలా సుందర్ పిచ్‌ను అర్థం చేసుకుని బౌలింగ్ చేశాడో ఊహించుకోవచ్చు.