IND vs BAN 1st Test: కష్టాల్లో టీమిండియా - కోహ్లి, రోహిత్ విఫలం - డకౌట్స్‌లో గిల్ చెత్త రికార్డ్
19 September 2024, 12:00 IST
IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న టెస్ట్‌లో టీమిండియా 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి దారుణంగా నిరాశపరిచారు. శుభమన్ గిల్ డకౌట్ అయ్యి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్
IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి దారుణంగా నిరాశపరిచారు. ఇద్దరు తలో ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. తన దూకుడుకు భిన్నంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ 19 బాల్స్ ఎదుర్కొని ఆరు పరుగులు చేశాడు.
క్రీజులో కుదరుకున్నట్లుగా కనిపిస్తోన్న అతడిని బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహముద్ ఔట్ చేస్తాడు. కెప్టెన్ షాంటోకు క్యాచ్ ఇచ్చిన రోహిత్ శర్మ పెవిలియన్ చేరుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన గిల్ డకౌట్ అయ్యాడు. ఎనిమిది బాల్స్ ఎదుర్కొన్న గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లి కూడా కేవలం ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు పేసర్ హసన్ మహముద్‌కే దక్కడం గమనార్హం.
ఆదుకున్న జైస్వాల్, పంత్...
34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే ఆడపాదడపా ఫోర్లు బాదారు. లంచ్ టైమ్ కు టీమిండియా 22 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 37పరుగులతో రిషబ్ పంత్ 33 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
హసన్ మహముద్ పేరు ట్రెండ్...
కాగా రోహిత్, కోహ్లి వికెట్లు తీసిన బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహముద్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది హసన్ మహముద్‌కు మూడో టెస్ట్ మాత్రమే కావడం గమనార్హం. ఇటీవల పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో 43 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు హసన్ మహముద్.
కోహ్లిపై ట్రోల్స్...
మరోవైపు బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన కోహ్లి, గిల్‌లను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తోన్నారు. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు నెల రోజుల పాటు ఫారిన్ ట్రిప్‌ను ఎంజాయ్‌చేశాడు కోహ్లి. ఫస్ట్ టెస్ట్ ఆరంభానికి ఐదు రోజుల ముందే ఇండియాకు వచ్చాడు. రెండు రోజుల ప్రాక్టీస్ చేసిన బ్యాటింగ్ దిగితే ఇలాగే ఉంటుందని కోహ్లిపై ఓ నెటిజన్ అన్నాడు. 2024లో కోహ్లి ఫామ్ ఏమంత గొప్పగా లేదని, ఈ ఏడాది టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
గిల్ చెత్త రికార్డ్...
చెన్నై టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో గిల్‌కు మూడో డకౌట్ ఇది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు డకౌట్ అయిన ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లి రికార్డును సమం చేశాడు. మోహిందర్ అమర్‌నాథ్ ఐదు డకౌట్స్‌తో ఈ చెత్త రికార్డులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గిల్ రెండు సార్లు డకౌట్ అయ్యాడు.