IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ప్లాన్-బితో టీమిండియా బరిలోకి, మారిపోయిన కాంబినేషన్-team india predicted playing xi for 1st test vs bangladesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ప్లాన్-బితో టీమిండియా బరిలోకి, మారిపోయిన కాంబినేషన్

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ప్లాన్-బితో టీమిండియా బరిలోకి, మారిపోయిన కాంబినేషన్

Galeti Rajendra HT Telugu
Sep 17, 2024 12:09 PM IST

India's playing XI for 1st Test vs Bangladesh: బంగ్లాదేశ్‌తో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని తొలుత టీమిండియా భావించింది. కానీ పిచ్‌ను చూసిన తర్వాత హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్‌ను మార్చినట్లు పీటీఐ తెలిపింది.

చెపాక్ స్టేడియంలో భారత టెస్టు ఆటగాళ్లు ప్రాక్టీస్
చెపాక్ స్టేడియంలో భారత టెస్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ (PTI)

IND vs BAN Test 2024: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి భారత్ జట్టు ప్లాన్-బితో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై దాదాపు క్లారిటీ వచ్చేసింది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ తొలి టెస్టు మ్యాచ్ కోసం ఎర్రమట్టి పిచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పేసర్లకు పిచ్‌ అనుకూలించనుండగా.. ఆస్ట్రేలియా టూర్ సన్నాహకాలకి కూడా ఇది భారత ప్లేయర్లకి ఉపయోగపడనుంది. దాంతో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్ (3-2)తో బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

ఈ నెల ప్రారంభంలో దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఆకాశ్ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో రాంచీలో జరిగిన టెస్టులో భారత టెస్టు టీమ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు స్పిన్నర్ల వార్తలకి కారణం.. 2019లో ఇదే బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత స్పిన్నర్లు కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఆ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 19 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

ప్లాన్-బికి ఓటేసిన రోహిత్, గంభీర్

చెపాక్ పిచ్‌ను పరిశీలించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్‌ను మార్చినట్లు తెలుస్తోంది. 3-2 కాకుండా.. 2-3 కాంబినేషన్‌తో తుది జట్టుని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారని, పేస్ బాధ్యతల్ని జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను పంచుకోనున్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దాంతో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు లేదని తేలిపోయింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన దులీప్ ట్రోఫీలో అక్షర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మెరిశాడు.

పంత్‌ కోసం జురెల్‌ త్యాగం

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జురైల్.. తొలి టెస్టులో రిజర్వ్ బెంచ్‌పై ఉండనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో రిషబ్ పంత్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు పీటీఐ తెలిపింది. చివరిసారిగా 2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కారు యాక్సిడెంట్‌తో సుదీర్ఘకాలం ఆటకి దూరంగా ఉండిపోయాడు. ఈ ఏడాది టీ20, వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చినా.. యాక్సిడెంట్ తర్వాత ఇంకా టెస్టులు ఆడలేదు.

బ్యాటింగ్ కాంబినేషన్ విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మూడో స్థానంలో శుభమన్ గిల్, నెం.4లో విరాట్ కోహ్లీ ఆడతారు. ఆ తర్వాత నెం.5 కోసం సర్ఫరాజ్ ఖాన్ నుంచి పోటీ ఎదురైనా.. కేఎల్ రాహుల్‌ వైపే గంభీర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నెం.6లో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అనంతరం జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా ఆడతారు.