India vs Bangladesh: టీమిండియాను టెన్షన్‌లో పడేసిన బుమ్రా.. రంగంలోకి దిగిన కోహ్లి, గంభీర్.. ఏం జరిగిందంటే?
India vs Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాను ఆందోళనలో పడేశాడు పేస్ బౌలర్ బుమ్రా. నెట్స్ లో అతడు చేసిన పనితో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
India vs Bangladesh: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు నెట్స్ లో అతడు పదేపదే ఔటవుతున్నాడు. ఇంగ్లండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో ఏకంగా 712 పరుగులు చేసి టాప్ ఫామ్ లో కనిపించిన ఈ ఓపెనర్.. నెట్స్ లో బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో కోహ్లి, గంభీర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
బుమ్రా బౌలింగ్.. జైస్వాల్ ఔట్
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత యశస్వి సడెన్ గా ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్లో సరిగా రాణించలేదు. టీ20 వరల్డ్ కప్ లో అవకాశమే రాలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నా.. నెట్స్ లోనే అతని ఫామ్ లేమి స్పష్టంగా కనిపించింది. చెన్నైలో తొలి టెస్టు జరగనుండగా.. కొన్ని రోజులుగా టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది.
మొదట యశస్వి నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లి తన వంతు కోసం పక్కన నిల్చొని వేచి చూస్తున్నాడు. అప్పుడు బుమ్రా బౌలింగ్ లో యశస్వి క్లీన్ బౌల్డయ్యాడు. ప్రపంచంలోనే మేటి బౌలర్ చేతిలో ఇలా ఔటవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కానీ అంతకుముందు ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, నెట్ బౌలర్ అయిన యుధ్‌వీర్ సింగ్ బౌలింగ్ లోనూ యశస్వి ఇలాగే ఔటయ్యాడు.
రంగంలోకి కోహ్లి, గంభీర్
అది చూసిన విరాట్ కోహ్లి వెంటనే యశస్వి దగ్గరకు వెళ్లి.. కాసేపు మాట్లాడాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్ లో ఉన్న లోపం గురించి కూడా వివరించాడు. అయినా కూడా యశస్వి నెట్స్ లో అలా విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా రంగంలోకి దిగాడు. యశస్విని పక్కకు తీసుకెళ్లి 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు.
నెట్స్ లో త్రో డౌన్స్ వేయించాడు. యశస్వి ఎక్కడ తడబడుతున్నాడో చూసి ఆ బలహీనతను అధిగమించేలా గౌతీ సూచనలు ఇచ్చాడు. ఇంగ్లండ్ తో ఫామ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ తోనూ యశస్వియే ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉండటంతో అతని ఫామ్ టీమ్ కు ఎంతో కీలకం కానుంది.
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
టీమిండియా హోమ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా గురువారం (సెప్టెంబర్ 19) నుంచి తొలి టెస్ట్ జరగనుంది. బంగ్లాతో రెండు టెస్టుల తర్వాత వచ్చే నెలలో న్యూజిలాండ్ తో మరో మూడు టెస్టుల సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది.
ఆ ఐదు టెస్టుల సిరీస్ పైనే టీమిండియా ఎక్కువగా దృష్టి సారించింది. వరుసగా మూడోసారీ ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో వెళ్తున్న ఇండియన్ టీమ్ కు ఈ రెండు హోమ్ సిరీస్ లు కీలకంగా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్న ఈ పది టెస్టుల్లో కనీసం 6 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.