Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి రూమర్లపై ఎట్టకేలకు స్పందించిన మహమ్మద్ షమీ
20 July 2024, 19:36 IST
- Mohammed Shami - Sania Mirza: సానిమా మీర్జాతో మహమ్మద్ షమీ పెళ్లి అంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. వీటిపై షమీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం మాట్లాడారు.
Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి రూమర్లపై ఎట్టకేలకు స్పందించిన మహమ్మద్ షమీ
భారత టెన్నిస్ స్టార్ సానిమా మీర్జాతో క్రికెటర్ మహమ్మద్ షమీ పెళ్లి జరగనుందంటూ చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఈ ఏడాది మొదట్లో సానియా విడాకులు తీసుకున్న తర్వాతి నుంచి ఈ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ విషయంపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ఫేక్ సమాచారం వ్యాప్తి చేయొద్దు
సానియా మీర్జాతో తన వివాహం అనేది తప్పుడు సమాచారం అని మహమ్మద్ షమీ వెల్లడించారు.సోషల్ మీడియాలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలాంటి ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని షమీ కోరాడు. మీమ్స్ చూసేందుకు సరదాగానే ఉంటాయని, కానీ ఎవరి వ్యక్తిగత గురించి అవి ఉండకూడదని చెప్పాడు.
కొందరు సరదాగా కోసం ఇలాంటి రూమర్లు సృష్టించారని మహమ్మద్ షమీ చెప్పాడు. “ఇది చాలా విచిత్రంగా ఉంది. సరదా కోసం ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసినవి ఇవి. కానీ మనం ఏం చేయగలం? మీమ్‌లు అనేవి వినోదం కోసమే ఉండాలి. అయితే, ఎవరి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి అయితే వాటిని షేర్ చేసే ముందు తప్పకుండా ఆలోచించాలి. కొందరు వ్యక్తులు అన్వైరిఫైడ్ పేజీల నుంచి వీటిని షేర్ చేస్తారు. దీంతో ఏదైనా చెప్పి తప్పించుకుంటారు” అని షమీ చెప్పారు. శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు.
ధైర్యం ఉంటే..
ధైర్యం ఉంటే ఇలాంటి రూమర్లు సృష్టించే వారు వెరిఫైడ్ పేజీల నుంచి చేయాలని, అప్పుడు తాను సమాధానం ఇస్తానని షమీ అన్నాడు. “నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ వెరిఫైడ్ పేజీలు ఇవన్నీ చెబితే, అప్పుడు నేను సమాధానం ఇచ్చేవాడిని. విజయం సాధించేందుకు ప్రయత్నించండి. ఇతరులకు సాయం చేయండి. మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి. అప్పుడే మంచి వ్యక్తులుగా ఉండగలరు” అని మహమ్మద్ షమీ చెప్పాడు.
గాయం కారణంగా సుమారు ఎనిమది నెలలుగా భారత జట్టుకు మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మళ్లీ భారత జట్టులో అడుగుపెట్టేందుకు కృషి చేస్తున్నాడు.
భార్య హసిన్ జహాన్‌తో 2018లో మహమ్మద్ షమీ విడిపోయారు. తాను గృహ హింసకు గురయ్యానంటూ హసిన్ ఆరోపణలు కూడా చేశారు.
సానియా - మాలిక్ విడాకులు
షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చినట్టు సానియా మీర్జా ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహం చేసుకున్నాక సానియా ఈ విషయాన్ని వెల్లడించారు. 2010 ఏప్రిల్ 12వ తేదీన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహం జరిగింది. అప్పట్లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్న సానియా.. పాక్ క్రికెటర్ మాలిక్‌ను పెళ్లాడడం సెన్సేషన్ అయింది. అందులోనూ మాలిక్‌కు అప్పటికే అది రెండో వివాహం. మాలిక్, సానియాకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించారు. సుమారు మూడేళ్ల నుంచే సానియా, మాలిక్ మధ్య విభేదాలు తలెత్తాయని రూమర్లు వచ్చాయి. వీరు చాలా కాలం వేర్వేరుగా ఉన్నారు. సనా జావేద్‌తో మాలిక్ రిలేషన్లో ఉన్నాడంటూ రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో సనాను మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతడికి అప్పటికే విడాకులు ఇచ్చేశానని సానియా వెల్లడించారు.