Mumbai Indians : సచిన్ టెండుల్కర్ని కూడా వదలని ముంబై ఫ్యాన్స్! హార్దిక్‌ని 'బూ' చేసినట్టే..
02 April 2024, 6:51 IST
- MI vs RR : ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్లోనూ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం తప్పలేదు. మరి ఎంఐ ఫ్యాన్స్‌ని శాంతింపజేయాలంటే పాండ్యా ఏం చేయాలి?
ఆర్ఆర్తో మ్యాచ్‌లో హర్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ
Hardik Pandya latest news : హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. చూస్తుంటే.. జట్టు ప్రదర్శనను ఎంఐ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు! వారి ఫోకస్ అంతా హార్దిక్ పాండ్యా మీదే, అతడిని 'బూ' చేయడం మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కాస్త శృతి మించినట్టే ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్ కొత్తేమీ కాదు. లెజెండరీ ప్లేయర్, క్రికెట్ గాడ్‌గా పేరు సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్ని కూడా ముంబై ఫ్యాన్స్ వదల్లేదు.
హార్దిక్.. సచిన్.. కోహ్లీ- ఎవ్వరిని వదల్లేదు!
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది ముంబై ఇండియన్స్. ఇది రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు ఎంఐ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ఫలితంగా.. జట్టు ఎక్కడికి వెళ్లినా.. హార్దిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అభిమానులు. సోమవారం ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ దృశ్యాలు కనిపించాయి. టాస్ కోసం గ్రౌండ్లోకి వెళ్లిన హార్దిక్‌ని ముంబై ఫ్యాన్స్ తెగ ఎగతాళి చేశారు. 'మర్యాదగా ప్రవర్తించండి' అని కామెంటేటర్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఫ్యాన్స్ అక్కడితో ఆగలేదు. మ్యాచ్ ఆశాంతం.. హర్దిక్ని బూ చేస్తూనే ఉన్నారు.
MI vs RR IPL 2024 : అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్ సాధారణమే! సచిన్ టెండుల్కర్‌కి కూడా ఇలాంటివి తప్పలేదు. 2005-06లో సచిన్‌కి రఫ్ ప్యాచ్ నడుస్తున్న సమయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగులు చేయడానికి కష్టపడుతున్న సచిన్ టెండులర్క్ని ముంబై ప్రేక్షకులు ఎగతాళి చేశారు.
ఇక విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2013లో అప్పటి ముంబై ఇండియన్స్ ప్లేయర్ అంబటి రాయుడును విరాట్ కోహ్లీ రనౌట్ చేసిన తీరు వివాదాస్పదమైంది. ఫ్యాన్స్ మాత్రం.. కోహ్లీని గట్టిగా బూ చేశారు. ముంబై రంజీ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. కేకేఆర్ జెర్సీ వేసుకుని వాంఖడేలో కనిపించినప్పుడు కూడా.. ప్రేక్షకులు ఎగతాళి చేశారు.
హార్దిక్ పాండ్యా ఇప్పుడేం చేయాలి?
రోహిత్ ఒక సీనియర్ ప్లేయర్. ముంబై ఇండియన్స్‌కి 5సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హార్దిక్ పాండ్యాపై కోపాన్ని చూపించడం తగ్గించుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. మరి పాండ్యా ఇప్పుడేం చేయాలి? అన్న ప్రశ్నకు.. సోమవారం జరిగిన మ్యాచ్‌లోనే సమాధానం దొరికింది.
Hardik Pandya Mumbai Indians : ముంబై ఇండియన్స్ 20/4తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చాడు హార్దిక్. ప్రేక్షకుల్లో అయోమయం కనిపించింది. జట్టు కష్టాల్లో ఉందని బాధపడాలా.. లేక హార్దిక్ పాండ్యాని బూ చేయాలా? అని అర్థం కాలేదు. ఆ సమయంలోనే.. 21 బాల్స్‌లో 34 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. అతను కొట్టిన ప్రతి బౌండరీకి.. ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది. అంటే.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ని తనవైపు తిప్పుకుని, ఇప్పటికే వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున్న ఉన్న ఎంఐ జట్టును మళ్లీ పైకి లేపాలంటే.. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేయాల్సిందే!